Brahmanandam: బ్రహ్మానందాన్ని దొంగను చేసిన చిరంజీవి, జంధ్యాల!

  • ఆత్మకథ రాసిన బ్రహ్మానందం
  • నేను మీ బ్రహ్మానందమ్ పేరిట మార్కెట్లోకి విడుదల
  • జంధ్యాల, చిరంజీవి తనను ఎలా ర్యాగింగ్ చేశారో చెప్పిన బ్రహ్మానందం
Brahmanandam explains how Chiranjeevi and Jandhyala teased him

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తన వ్యక్తిగత జీవితం, సినీ జీవితంలోని ఆసక్తికర అంశాలను ఓ పుస్తకరూపంలో తీసుకువచ్చారు. ఆ పుస్తకం పేరు 'నేను మీ బ్రహ్మానందమ్'. ఇందులో తనకు గురు సమానుడైన జంధ్యాల గురించి, సన్నిహితుడైన మెగాస్టార్ చిరంజీవి గురించి పలు విషయాలను బ్రహ్మానందం పంచుకున్నారు. ఓసారి వాళ్లిద్దరి కారణంగా తాను దొంగ అనిపించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.

"చంటబ్బాయ్ చిత్రంలో ఓ పాటను చిత్రీకరించేందుకు చిరంజీవి, దర్శకుడు జంధ్యాల మిగతా యూనిట్ అంతా కలిసి ఊటీ వెళ్లారు. అక్కడ చిరంజీవి గారికి ఎంటర్టయిన్ మెంట్ కరవైందని నన్ను పిలిపించమన్నారు. అందుకు జంధ్యాల గారు కూడా ఓకే అన్నారు. మేనేజర్ నాకు ఫోన్ చేసి అర్జంటుగా బయల్దేరి ఊటీ రమ్మన్నాడు. ఆ సమయంలో నేను అత్తిలిలో ఉన్నాను. దాంతో వెంటనే బయల్దేరాను. నా మీద ప్రేమతో కాకపోయినా, పిలిచింది చిరంజీవి గారు కావడంతో నాకు సప్తగిరి ఎక్స్ ప్రెస్ లో ఏసీ కోచ్ లో టికెట్ బుక్ చేశారు. 

ఆ ఏసీ కోచ్ లో డబ్బులిస్తే దుప్పట్లు ఇస్తారన్న విషయం తెలియక, ప్రయాణం అంతా చలికి వణికిపోయాను. కోయంబత్తూరులో దిగగానే ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. చిరంజీవి గారు బస చేసిన హోటల్ లోనే ఆయన సూట్ పక్కనే నాకో సూట్ బుక్ చేశారు. అక్కడున్న రెండ్రోజులు చిరంజీవిని, జంధ్యాల గారిని నవ్విస్తూనే ఉన్నాను. 

కానీ ఆ తర్వాతే అసలు  విషయం జరిగింది. ఇక మేం బయల్దేరే సమయం వచ్చింది. నా సూట్లో నేను రెడీ అవుతుండగా, చిరంజీవి గారు వచ్చారు. ఏం బ్రహ్మం.. అన్నీ సర్దుకున్నావా.. ఏమీ మర్చిపోలేదు కదా? అన్నారు. నాలుగు జతల బట్టలే కదా సార్... ఏమీ మర్చిపోలేదు అని చెప్పాను. సరే అని చిరంజీవి వెళ్లిపోయారు. 

నేను నా సూట్ కేసు తీసుకుని రిసెప్షన్ వద్దకు చేరుకున్నాను. అయితే, రిసెప్షన్ లో ఉన్న ఓ వ్యక్తి వచ్చి మీ లగేజి చెక్ చేయాలి అన్నారు. దాంతో చిరంజీవి వాట్ నాన్సెన్స్ అంటూ చిరాకుపడ్డారు. వాళ్లు మరోసారి అడగడంతో సరే చెక్ చేసుకోండి అన్నారు. మొదట చిరంజీవి, జంధ్యాల సూట్ కేసులు చెక్ చేశారు. ఆ తర్వాత నా సూట్ కేసు తెరవగానే అందులో బట్టల కింద స్పూన్లు, ఫోర్కులు కనిపించాయి. అది చూడగానే ఒక్కసారిగా నా మెదడు పనిచేయడం ఆగిపోయింది, కాళ్ల కింద భూమి కదిలినట్టయింది.

చిరంజీవి వెంటనే... బ్రహ్మం ఏంటయ్యా ఇది... మరీ ఇంత చీప్ గా... ఆర్టిస్టుల పరువు తీశావు కదయ్యా? అన్నారు. నన్ను రిసెప్షన్ లో ఓ మూలకు నిల్చోబెట్టారు. ఒక్కసారి నా ఆలోచనలను వెనక్కి తీసుకెళ్లాను. చిరంజీవి గారు నా రూంలోకి వచ్చి సూట్ కేసులో ఉన్న షర్టు తీసుకుని ఈ చొక్కా బాగుందయ్యా... ఎక్కడ కుట్టించావ్ అని అడగడం గుర్తొచ్చింది. ఆ తర్వాత అన్నీ సర్దుకున్నావా? అని అడిగేసి ఆయన వెళ్లిపోయారు. అప్పుడు నేను అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాను. 

ఇది చిరంజీవి పనే అని అర్థమయ్యి కానట్టుగా ఉంది. నన్ను టీజింగ్ చేస్తున్నారా, ర్యాగింగ్ చేస్తున్నారా... కానీ అడగాలంటే భయం. ఇంతలో జంధ్యాల కూడా... ఏంటి సార్ ఈ దరిద్రపు పని... నేను ఎంకరేజ్ చేస్తోంది మీలాంటివాళ్లనా? పరువు పోయింది అన్నారు. అప్పటికే నేను బిక్కచచ్చిపోయి బిత్తర చూపులు చూస్తున్నాను. 

ఆ తర్వాత, ట్రైన్ టైమ్ అవుతోందంటూ చిరంజీవి, జంధ్యాల వెళ్లిపోయారు. నా పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు. నా ట్రైన్ టికెట్ కూడా వాళ్ల వద్దే ఉంది. నన్ను ఈ హోటల్ వాళ్లు పంపిస్తారో లేదో తెలియదు. ఇలా ఆలోచిస్తుండగా, చిరంజీవి గారి అసిస్టెంట్... రిసెప్షనిస్టుతో మాట్లాడి నా దగ్గరకు వచ్చాడు. నేను వాళ్లతో మాట్లాడాను లెండి సర్... రండి వెళదాం అన్నాడు. 

ఇంతలో రిసెప్షన్ వ్యక్తి వచ్చి ఇకముందు ఇలాంటి పనులు చేయకండి అన్నాడు. తలూపితే దొంగతనం చేసినట్టవుతుంది.. తలూపకపోతే వదిలిపెడతారో లేదో అనే భయం... నా ఆలోచన ఇలా సాగుతుండగానే చిరంజీవి అసిస్టెంట్ "అడ్డంగా దొరికిపోయాక ఇక ఇలాంటివి చేయడులెండి" అని చెప్పాడు. దాంతో అక్కడ్నించి బయటికి వచ్చాను. అప్పటికే చిరంజీవి, జంధ్యాల గారు ఎక్కిన కారు బయల్దేరుతోంది. దాంతో ఇద్దరం పరుగుతీసినంత పనిచేసి ఆ కారు ఎక్కాం. 

కారు ఎక్కగానే, చిరంజీవి అసిస్టెంట్ కూడా... ఏంటి సార్ ఇలా చేశారు? అన్నాడు. పుండు మీద కారం చల్లినట్టయింది. నాకు చెబితే అవి నేను కొనిచ్చేవాడిని కదా అన్నాడు. దాంతో నా మీద నాకు జాలేసింది.

ఇంతలో రైల్వే స్టేషన్ వచ్చింది. ముగ్గురం రైలెక్కాం. రైలెక్కగానే ఓ పాట పాడవోయ్ అంటూ జంధ్యాల గారు అడిగారు. వాళ్ల బలవంతం మీద అందమే ఆనందం అంటూ పాడసాగాను. ఇంతలో మా తలుపు చప్పుడవడంతో నా గొంతు విని పక్క బోగీలో వాళ్లు కొట్టడానికి వచ్చేరేమో అనుకున్నాను. కానీ వచ్చింది టీసీ. 

ఆ టీసీ టికెట్ అడిగాడు. చిరంజీవి, జంధ్యాల వాళ్లిద్దరి టికెట్లు మాత్రమే చూపించారు. టీసీ నా వైపు చూశాడు... నేను వాళ్లిద్దరి వైపు చూశాను... వాళ్లిద్దరూ మాకేమీ సంబంధం లేదన్నట్టు ఫ్యాన్ వైపు చూశారు. అప్పుడర్థమైంది... ఇది కూడా వాళ్లిద్దరి స్క్రీన్ ప్లేలో ఒక భాగమని. చేతులు జోడించి ఈ అర్భకుడిని ఇకనైనా క్షమించి వదిలేయండి అని అడిగాను. అప్పుడు నవ్వడం మొదలుపెట్టారు వాళ్లిద్దరూ. 

ముందు వాళ్లు నవ్వడం మొదలుపెట్టారు... ఆ తర్వాత నేను నవ్వాల్సి వచ్చింది. రిసెప్షన్ లోనూ, ట్రైన్ లోనూ నా అవస్థలు గమనిస్తూ వాళ్లెంత సేపు నవ్వుకున్నారో చెప్పీ చెప్పీ నవ్వీ నవ్వీ... అలా ఆ ప్రయాణం సాగింది" అంటూ బ్రహ్మానందం వివరించారు. 

అప్పటినుంచి ఇప్పటిదాకా... జంధ్యాల గారు మధ్యలోనే దిగిపోయినా (ఈ లోకాన్ని వదిలి)... చిరంజీవి గారితో మాత్రం నా ప్రయాణం చిరంజీవ చిరంజీవ అన్నట్టుగా కొనసాగుతూనే ఉందని బ్రహ్మానందం పేర్కొన్నారు.

More Telugu News