G. Kishan Reddy: ఆరు గ్యారెంటీల ఆలస్యానికే ప్రజాపాలన.. ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు: కిషన్ రెడ్డి

  • రేషన్ కార్డులు ఇవ్వకుండానే వివిధ పథకాలకు వాటిని జత చేయాలని ఎలా చెబుతున్నారు? అని నిలదీత
  • అభయహస్తం రాజకీయ దృక్పథంతో కూడుకున్నదే తప్ప ప్రజలకు ప్రయోజనం లేదని విమర్శ
  • దరఖాస్తులు బ్లాక్‌లో విక్రయించే పరిస్థితి వచ్చిందన్న కిషన్ రెడ్డి
Kishan Reddy counter to congress leaders over kaleswaram project

ఆరు గ్యారెంటీల అమలును ఆలస్యం చేయడానికే ప్రజాపాలన - అభయహస్తం దరఖాస్తులు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రేషన్ కార్డులు ఇవ్వకుండానే.. వివిధ పథకాలకు వాటిని జత చేయాలని ఎలా చెబుతున్నారు? అని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న లబ్ధిదారుల సమాచారంతో పథకాలను అమలు చేసే అవకాశం ఉందన్నారు. అభయహస్తం రాజకీయ దృక్పథంతో కూడుకున్నదే తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదన్నారు.

దరఖాస్తు పత్రాలను బ్లాక్‌‍లో విక్రయించే పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అభయహస్తం దరఖాస్తు ఇవ్వకుంటే మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందదని చెబుతున్నారని మండిపడ్డారు. ఈ దరఖాస్తులు లేకుండానే హామీల అమలుకు ఎన్నో సదుపాయాలు ఉన్నాయన్నారు. ప్రధాని కిసాన్ సమ్మాన్, రైతు భరోసా డేటా ఉన్న తర్వాత మళ్లీ రైతుబంధు కోసం వివరాలు ఎందుకు? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయ విచారణకు తోడు కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలన్నారు.

ఇటీవల కాంగ్రెస్ ప్లీనరీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ మెడిసిన్ ఎక్స్‌పైరీ అయిందని చెబుతున్నారని.. కానీ దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని నడిపించే సంజీవిని మోదీ మెడిసిన్ అని గుర్తుంచుకోవాలని చురక అంటించారు. రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు మోదీ మెడిసిన్ ఎక్స్‌పైరీ కాదని వ్యాఖ్యానించారు. అసలు ఇప్పటి వరకూ రాహుల్ గాంధీ మెడిసిన్ ఫార్ములానే రిజెక్ట్ అయిందని ఎద్దేవా చేశారు.

తెలంగాణలోకి సీబీఐ రాకుండా గత బీఆర్ఎస్ అడ్డుకుందని కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చిందని... కాబట్టి సీబీఐకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖ రాయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణతో పాటు న్యాయ విచారణ కావాలని తాను చెప్పానని.. కానీ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్న చందంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. తనపై కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

More Telugu News