Raghavendra Rao: మనవరాలిగా చేసిన శ్రీదేవే మీకు జోడీ అనగా ఎన్టీఆర్ రియాక్షన్ ఏమిటంటే..!: రాఘవేంద్రరావు

  • 'బడి పంతులు'లో ఎన్టీఆర్ కి మనవరాలిగా శ్రీదేవి 
  • 'పదహారేళ్ల వయసు' హీరోయిన్ గా క్రేజ్
  • 'వేటగాడు'లో ఆమెను తీసుకోవడానికి కంగారుపడిన నిర్మాతలు 
  • ఎన్టీఆర్ వాళ్ల టెన్షన్ తగ్గించారన్న రాఘవేంద్రరావు

Raghavendra Rao Interview

ఎన్టీ రామారావు - రాఘవేంద్రరావు కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకూ సూపర్ హిట్లే. అలాంటి సినిమాలలో 'వేటగాడు' ఒకటిగా కనిపిస్తుంది. 1979లో విడుదలైన ఆ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సాధించింది. తాజా ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.

"శ్రీదేవి చేసిన 'పదహారేళ్ల వయసు' సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాతనే 'వేటగాడు' సినిమా చేయవలసి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవిని పెడదామని నేను నిర్మాతలతో అన్నాను. ఆ మాట వినగానే వాళ్లు కంగారు పడిపోయారు. 'బడిపంతులు' సినిమాలో ఎన్టీఆర్ కి మనవరాలిగా శ్రీదేవి చేసింది. అందువలన అన్నగారు కోప్పడతారేమోనని అన్నారు. 

ఎన్టీఆర్ గారితో నేను మాట్లాడతాను .. ఆయన ఓకే అంటే మీకు ఓకే కదా అన్నాను నేను .. ఓకే అన్నారు వాళ్లు. దాంతో నేను వెళ్లి రామారావుగారిని కలిశాను. '16 ఏళ్ల వయసు'లో చేసిన అమ్మాయిని 'వేటగాడు'లో హీరోయిన్ గా పెడదామని అనుకుంటున్నట్టుగా చెప్పాను. అలాగే కానివ్వండి బ్రదర్ .. ఆమెకి పదహారేళ్లు అయితే మనకి పద్నాలుగే కదా" అంటూ ఆయన నవ్వేశారు" అని చెప్పారు.

More Telugu News