Divya Pahuja: బెయిలుపై బయటకొచ్చిన మాజీ మోడల్ దారుణ హత్య.. అశ్లీల ఫొటోలతో బెదిరిస్తోందనే చంపేశానన్న హోటల్ యజమాని!

Ex model Divya Pahuja murder case Gurugram police collect cctv footage
  • గురుగ్రామ్‌లో ఓ హోటల్‌లో నిన్న దారుణ హత్య
  • ఏడేళ్ల జైలు శిక్ష అనంతరం ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చిన దివ్య
  • మంగళవారం రాత్రి హోటల్ రూములో దివ్యను హత్య చేసిన అభిజీత్
  • మృతదేహాన్ని మాయంచేసే ప్రయత్నం చేస్తుండగా ముగ్గురి అరెస్ట్

గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ హత్య కేసులో ఏడేళ్లపాటు జైలులో ఉండి ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చిన మాజీ మోడల్ దివ్య పహుజా (27) నిన్న గురుగ్రామ్‌లో దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అభిజీత్ సింగ్ సహా మొత్తం ఐదుగురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. దివ్య మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నిస్తుండగా వీరిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాన నిందితుడు అభిజీత్ మంగళవారం రాత్రి దివ్యను హోటల్ రూముకు తీసుకెళ్లి కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. హోటల్ యజమాని అయిన తనను అశ్లీల ఫొటోలతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడం వల్లే ఆమెను హతమార్చినట్టు అభిజీత్ అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. దివ్య సోదరి నైనా పహుజా వాదన మరోలా ఉంది. సందీప్ గడోలీ సోదరి సుదేశ్ కటారియా, సోదరుడు బ్రహ్మ ప్రకాశ్‌లే కలిసి అభిజీత్‌తో హత్య చేయించారని ఆరోపించింది.

గడోలీ హత్య విషయానికి వస్తే.. 6 ఫిబ్రవరి 2016లో ముంబైలో జరిగిన కాల్పుల్లో గడోలీ మరణించాడు. గాళ్‌ఫ్రెండ్ దివ్య సాయంతో ఉచ్చులోకి లాగి అతడిని చంపేసినట్టు ఆరోపించారు. ఈ కేసులో ఏడేళ్లపాటు జైలులో ఉన్న దివ్య ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చింది. అంతలోనే ఆమె హత్యకు గురికావడం కలకలం రేపింది.

  • Loading...

More Telugu News