India vs South africa: టీమిండియా ఎదుర్కొన్న 11 బంతుల్లో 6 వికెట్లు, 0 పరుగులు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!

  • 153 పరుగుల వద్ద ఏకంగా 6 వికెట్లు కోల్పోయిన భారత్
  • ఒక నిర్ధిష్ట స్కోరు వద్ద అత్యధిక వికెట్లు కోల్పోవడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి
  • భారత్ ఇన్నింగ్స్ 34, 35 ఓవర్లలో చెరో మూడు వికెట్లు తీసిన లుంగీ ఎంగిడి, కగిసో రబాడ
6 wickets and 0 runs in 11 balls faced by Team India and This is the first time in 147 years

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో ఏమాత్రం ఊహించని రికార్డులు నమోదవుతున్నాయి. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో చెలరేగడంతో కేవలం 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ అయ్యింది. టెస్టు క్రికెట్‌లో ఏ జట్టుపైనైనా దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఇక భారత్ భారీ ఆధిక్యం సాధిస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. 98 పరుగుల ఆధిక్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీమిండియా సునాయాసంగా ఆధిక్యంలోకి వచ్చినప్పటికీ ఇన్నింగ్స్ 34వ ఓవర్ నుంచి ఆట మొత్తం మారిపోయింది. టీమిండియా బ్యాటింగ్ లైనప్ అంచనాలకు అందని రీతిలో కుప్పకూలింది.

4 వికెట్ల నష్టానికి 153 పరుగుల పటిష్ఠ స్థితిలో ఉండడంతో భారత్ చక్కటి ఆధిక్యం సాధించడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో ఆట అనూహ్య మలుపు తిరిగింది. ఆ ఓవర్‌లో లుంగీ ఎంగిడి మొదట కేఎల్ రాహుల్‌ను ఔట్ చేశాడు. అదే ఓవర్‌లో రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలను కూడా పెవిలియన్ పంపాడు. ఆ మరుసటి ఓవర్ వేసిన కగిసో రబాడ కూడా అద్భుతం చేశాడు. విరాట్ కోహ్లి, ప్రసిద్ధ్ కృష్ణలను అతడు ఔట్ చేయగా అదే ఓవర్‌‌లో‌ ముఖేశ్ కుమార్ రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండానే ఆరు వికెట్లను కోల్పోయింది. టెస్ట్ మ్యాచ్‌లో ఒక నిర్దిష్ట స్కోరు వద్ద అత్యధిక వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. 1877లో టెస్ట్ క్రికెట్ మొదలైన నాటి నుంచి ఒక నిర్దిష్ట స్కోరు వద్ద 5కు మించి ఎక్కువ వికెట్లు కోల్పోలేదు. అంతకుముందు ఒక నిర్దిష్ట స్కోరులో ఐదు వికెట్లు కోల్పోయిన సందర్భాలు నాలుగు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

కేప్‌టౌన్ మ్యాచ్ సంక్షిప్త స్కోర్లు

  • దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 15 పరుగులు చేసిన కైల్ వెర్రెయిన్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. మహ్మద్ సిరాజ్ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
  • భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 34.5 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ అయ్యింది. విరాట్ కోహ్లీ( 46) టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ(39), శుభ్‌మాన్ గిల్ (36) చొప్పున పరుగులు చేశారు. లుంగీ ఎంగిడి 3/30, కగిసో రబడ 3/38, నాంద్రే బర్గర్ 3/42) చొప్పున వికెట్లు తీశారు.
  • దక్షిణాఫ్రికా రెండవ ఇన్నింగ్స్ కొనసాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి జట్టు స్కోరు 3 వికెట్ల నష్టానికి 62 పరుగులుగా ఉంది. ముకేశ్ కుమార్ 2, బుమ్రా 1 వికెట్లు తీశారు. ప్రస్తుతానికి భారత్ 36 పరుగుల ఆధిక్యంలో ఉంది.

More Telugu News