Ravindra Jadeja: రెండో టెస్టుకు జట్టులో 2 కీలక మార్పులు?.. టీమిండియా తుది జట్టు అంచనా ఇదే!

  • అశ్విన్ స్థానంలో జడేజా, ప్రసిద్ధ్ కృష్ణకు బదులు ముఖేశ్ కుమార్‌లను జట్టులోకి తీసుకునే అవకాశాలు
  • సిరీస్‌ను సమం చేయడమే లక్ష్యంగా తుది జట్టులో రెండు మార్పులకు అవకాశం
  • కేప్‌టౌన్ టెస్టులో గెలిచి కొత్త ఏడాదిని సానుకూలంగా మొదలుపెట్టాలని భావిస్తున్న భారత్
2 key changes in the team for the second test in Team India

నూతన సంవత్సరం 2024ను విజయంతో సానుకూలంగా మొదలు పెట్టాలని టీమిండియా భావిస్తోంది. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టులో ఎలాగైనా గెలవాలని యోచిస్తోంది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆతిథ్య సౌతాఫ్రికాపై కేప్‌టౌన్ టెస్టులో గెలుపే లక్ష్యంగా జట్టులో రెండు కీలకమైన మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

వెన్నునొప్పి కారణంగా మొదటి టెస్టుకు దూరమైన స్పిన్నర్ రవీంద్ర జడేజాను రెండో టెస్టులో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి జడేజా గాయంపై సమాచారం లేదు. అయితే అతడు అందుబాటులో ఉంటే జట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేప్‌టౌన్ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందనే అంచనాలున్నాయి.  ఇందుకు అనుగుణంగా నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కాంబినేషన్‌లో ఆడాలనుకుంటే రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టి జడేజాను తీసుకునే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

ఇక మొదటి టెస్టులో పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ సెంచూరియన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ ఒకే ఒక్క వికెట్ తీసి నిరాశపరిచాడు. దీంతో అతడిని రెండో టెస్టుకు పక్కనపెట్టే అవకాశాలున్నాయి. సెంచూరియన్ టెస్టులో భుజం గాయానికి గురైన శార్థూల్ ఠాకూర్ సోమవారం ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్‌ చేస్తూ కనిపించాడు. అతడు ఫిట్‌గా ఉండడంతో జట్టులో యథావిథిగా కొనసాగించే అవకాశాలున్నాయి. అయితే ప్రసిద్ధ్ స్థానంలో అవేశ్ ఖాన్ లేదా ముఖేష్ కుమార్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. కాగా గత ఏడాది జులైలో వెస్టిండీస్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ముఖేష్ ఆడాడు. దీంతో కేప్ టౌన్ టెస్ట్‌కు అవేశ్ ఖాన్ కంటే అతడికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

తుది జట్టు అంచనా ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా.

More Telugu News