Chandrababu: వైసీపీ వాళ్లు అందుకే చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్లిపోతున్నారు: చంద్రబాబు

  • కుప్పం నియోజవర్గంలో మూడ్రోజుల పాటు చంద్రబాబు పర్యటన
  • విస్తృతస్థాయిలో ప్రజలతో మమేకం అయిన చంద్రబాబు
  • బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న టీడీపీ అధినేత
Chandrababu Kuppam tour concludes

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేటితో ముగిసింది. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన మూడ్రోజుల పాటు సాగింది. వివిధ ప్రాంతాల్లో రోడ్ షోలతో చంద్రబాబు విస్తృతస్థాయిలో ప్రజల్లోకి వెళ్లారు. కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో ఆయన ప్రజలతో మమేకం అయ్యారు. టీడీపీ అధినేత ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 

కాగా, ఈ సాయంత్రంతో కుప్పం నియోజకవర్గం పర్యటన ముగించుకున్న చంద్రబాబు మల్లనూరు నుంచి బెంగళూరు పయనం అయ్యారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు.

మూడు రోజు పర్యటనలో భాగంగా కుప్పం, మల్లనూరులో పర్యటించారు. కుప్పంలోని అన్నా క్యాంటీన్ ను సందర్శించి భోజన వితరణ చేశారు. అనంతరం మసీదులో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని,  తరువాత పెద్దపులి గంగమ్మను దర్శించుకున్నారు. అనంతరం కుప్పం, మల్లనూరులో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. 

వైసీపీ మునిగిపోయే నావ అని, దాన్ని ఎవరూ కాపాడలేరని చంద్రబాబు విమర్శించారు. వైసీపీలోనే తిరుగుబాటు మొదలైంది... వాళ్ల ఎమ్మెల్యేలే చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్తున్నారన్నారు. నాలుగున్నరేళ్లుగా జగన్ అందరినీ ఏడిపించాడని, ఇప్పుడు జగన్ వంతు వచ్చిందన్నారు. నా కోసం కాకుండా మీ భవిష్యత్తు కోసం ఇంటికొకరు జెండా పట్టుకుని బయటకు రావాలని, అడ్డుకున్నవారికి అదే జెండాతో బడితపూజ చేయండని పిలుపునిచ్చారు. 

ఇంతకంటే నాకు ఇంకేం కావాలి?

అన్ని వర్గాల స్పందన చూస్తున్నా... మీ స్పందనకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. నన్ను కుప్పం నుండి 7 సార్లు గెలిపించారు... మళ్లీ గెలిపించబోతున్నారు. టీడీపీ జెండా తప్ప మరో జెండా తెలియని వాళ్లు కుప్పం ప్రజలు. ఒక నాయకుడిగా ఇంతకంటే నాకేం కావాలి.? మా భవిష్యత్తుకు మీరే గ్యారంటీ అంటూ పిల్లలు, యువత, ఆడబిడ్డలు కోరుతున్నారు. కుప్పంలో జరిగిన అభివృద్ధి టీడీపీ తప్ప... మరొక పార్టీ చేయలేదు. ఈ ఐదేళ్లలో మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? స్కూళ్లకు రంగులు వేసుకుంటే విప్లవం వచ్చినట్లా?

బటన్ నొక్కడం వెనుక చిదంబర రహస్యం ఇదే!

ఫీజు రీయింబర్స్ మెంట్ కు కటింగ్ లు పెట్టి, బటన్ నొక్కుతున్నాడు. అందులోనే చిదంబర రహస్యం ఉంది... సాక్షి పత్రికకు ప్రకటనల కోసమే బటన్ నొక్కుతున్నాడు. ఆసుపత్రుల్లో రోగులకు అన్నం పెట్టే పరిస్థితి కూడా ఈ రోజు లేదు. ఇలాంటి దద్దమ్మ సీఎంను ఎప్పుడూ నేను చూడలేదు. ఈ ఐదేళ్లలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. 20 ఏళ్ల క్రితం నేను ఐటీకి ప్రాధాన్యం ఇచ్చాను... ఇక్కడ కూడా లక్షల్లో జీతాలు తీసుకునేవారు ఉన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ... సంపద విధ్వంసం చేసే పార్టీ వైసీపీ. 

పది రూపాయలను వంద రూపాయలు చేస్తా

జగన్ తో పాటు వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పడంలో దిట్ట. జగన్ మాదిరిగానే ఊరికో సైకో తయారయ్యాడు. మన కుప్పంలో రౌడీయిజం ఎప్పుడైనా ఉందా? కానీ ఇప్పడు రౌడీయిజం చేస్తున్నారు. 5 ఏళ్లుగా బాదుడే బాదుడు. అన్ని ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్, డీజల్, విద్యుత్, బస్సు ఛార్జీలు, పన్నుల భారం పెరిగింది. మీకు ఇచ్చేది పది రూపాయలు... దోచుకునేది వంద రూపాయలు. సూపర్ సిక్స్ ద్వారా... పది రూపాయలను వంద రూపాయలు చేసే బాధ్యత తీసకుంటా. వైసీపీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లు, ఆఖరికి ఎంపీపీలు కూడా అబద్ధాలే చెప్తున్నారు.

ఇలాంటి మర్డర్ టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా జరగలేదు

వివేకా హత్య జరిగి ఐదేళ్లు అయింది.  ఇలాంటి హత్య టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా జరగలేదు. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగింది. చనిపోయిన వెంటనే గుండెపోటు అన్నారు... సాక్షిలో కూడా వార్తలు వేసుకున్నారు. మళ్లీ తర్వాత రక్తపు వాంతులు చేసుకుని చనిపోయాడని అన్నారు. తల పగిలి చనిపోయి ఉంటాడని అనుమానం వచ్చిన అన్న తర్వాత హత్య అని చెప్పారు. గొడ్డలితో వివేకా తలను బద్ధలు కొట్టారు. 

గొడ్డలి పోటు అని బయటకు వచ్చాక నారాసుర రక్త చరిత్ర అని నా మీద నింద వేశారు. మా తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు, మా బాబాయ్ ని హత్య చేశారు అని చెప్పుకుని ఓట్లేయించుకున్నాడు. ఆయన మాటలు విని మీరంతా ఒక్క ఛాన్స్ అడిగారని ఓట్లు వేశారు. హైకోర్టుకు వెళ్లి హత్య వివరాలు బయటకు చెప్పకూడదని స్టే తెచ్చుకున్నారు. సీబీఐ విచారణ కావాలని కోర్టుకు వెళ్లాడు... ఎన్నికల తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పాడు. ఊసరవెల్లి మాదిరిగా వివేకాహత్య విషయంలో ప్రవర్తించాడు. 

మళ్లీ బెంగళ్లూరులో ఆస్తుల వివాదాలతో హత్య జరిగిందన్నారు. కాదు.. రెండో పెళ్లి వివాదం, అల్లుడు హత్య చేయించాడని చెప్పాడు. కూతురు సునీతారెడ్డి చంపిందని మళ్లీ మాట మార్చుతున్నారు. సునీల్ యదవ్ తల్లితో వివేహేతర సంబంధం వల్ల చంపారని ఇప్పుడు పుకార్లు పుట్టిస్తున్నారు. 

అందుకే చెప్తున్నా వివేకా హత్య కేసు ఒక కేస్ స్టడీ. వివేకానందరెడ్డి హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని అరెస్టు చేయడానికి సీబీఐ వెళ్తే అన్ని రకాల ప్రయత్నాలు చేసి అరెస్టు కాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఏకంగా సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పై కేసు పెట్టారు. వివేకా పీఏ కృష్ణారెడ్డిని ప్రభావితం చేసి హత్యలో సునీతారెడ్డి ప్రమేయం ఉందని విచారణ చేయాలని చెప్తున్నారు. హత్యలు  చేసిన వారికి పక్కనబెట్టుకుని కాపాడే ప్రయత్నం చేస్తూ ఇతరులపై నేరం నెట్టాలని చూస్తున్నారు.

ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండటానికి వీళ్లేదు

వచ్చే ఎన్నికల్లో మీరు ఏమాత్రం ఏమారినా మీ మరణ శాసనం మీరు రాసుకున్నట్లే. ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదు. ఆడబిడ్డలకు మహాశక్తి పథకం తీసుకొచ్చాను. ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.15 వందలు అందిస్తాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ద్వారా రూ.15 వేలు అందిస్తాం. దీపం పథకం ద్వారా యేడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. ఆడబిడ్డ ఎక్కడికి పోవాలన్నా ఛార్జీలు లేకుండా ఉచితంగా బస్సు ప్రయాణ  సౌకర్యం కల్పిస్తాం.  

వచ్చేది సైకిల్ పాలన


కరుడుగట్టిన నేరస్తుడు సీఎం అయితే పాలన ఇలాగే ఉంటుంది. తల్లి, చెల్లి, బాబాయ్ ని లెక్క చేయనోడికి మీరొక లెక్కా.? మతి స్తిమితం ఉన్నోడు తప్పుడు పనులు చేయడు. పిచ్చోడు చేతిలో రాయి ఉంటే ఎవరో ఒకరిపైన వేస్తాడు. నూతన సంవత్సరంలో సైకో పాలన పోయి... సైకిల్ పాలన వస్తుంది’’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News