Nara Lokesh: ఏ కష్టమొచ్చినా మీకు తోడుగా ఉంటా!: మంగళగిరి నియోజకవర్గం తటస్థ ప్రముఖులతో లోకేశ్

  • మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ పర్యటన
  • వివిధ వర్గాలను కలుస్తున్న టీడీపీ యువనేత
  • తాజాగా క్రైస్తవ ప్రముఖులతో భేటీ
  • స్వయంగా వారి నివాసాలకు వెళ్లి కలిసిన లోకేశ్
Nara Lokesh met various sectors people in Mangalagiri constituency

మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ కష్టమొచ్చినా అండగా నిలబడతానని, మంగళగిరి సమగ్రాభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తటస్థ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. లోకేశ్ వరుసగా 4వ రోజు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 

తొలుత డోలాస్ నగర్ కు చెందిన పాస్టర్ కుమ్మరకుంట రవికుమార్ ఇంటికి వెళ్లగా, వారి కుటుంబసభ్యులు లోకేశ్ ను సాదరంగా ఆహ్వానించారు. పాస్టర్ రవికుమార్ తాడేపల్లితో పాటు నియోజకవర్గ పరిధిలోని డోలాస్ నగర్, ముగ్గురోడ్డు, అంజిరెడ్డి కాలనీ, నులకపేట, పెదకొండూరు, నిడమర్రు, మంగళగిరి పార్కురోడ్డులోని చర్చిలకు క్రైస్తవ మతపెద్దగా వ్యవహరిస్తున్నారు.

నియోజకవర్గంలో ఆయా చర్చిల వద్ద మౌలిక సదుపాయాలు లేక ప్రతి ఆదివారం ప్రార్థనల కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని లోకేశ్ దృష్టికి తెచ్చారు. మరి కొన్ని రోజుల్లో రాబోయే ప్రజా ప్రభుత్వం క్రైస్తవ సోదరులకు అండగా ఉంటుందని, మీ బిడ్డగా నన్ను దీవించాలని లోకేశ్ కోరారు. 

అనంతరం లోకేశ్ మంగళగిరి పట్టణానికి చెందిన ప్రముఖ ఆడిటర్ ఇసునూరు అనిల్ చక్రవర్తిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన అనిల్ చక్రవర్తి మంగళగిరి రోటరీ క్లబ్ కు మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం మంగళగిరి రోటరీకి క్లబ్ ట్రైనర్ గా వ్యవహరిస్తూ నియోజకవర్గ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన తమ సమస్యలను లోకేశ్ కు వివరించారు.

రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆడిటర్లు తమ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తామని లోకేశ్ చెప్పారు. నియోజకవర్గాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు మీ వంతు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. 

చివరగా మంగళగిరి 30వ వార్డుకు చెందిన కొలికపూడి రూఫస్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. రూఫస్ గత పాతికేళ్లుగా మంగళగిరిలో శాంతిదూత మినిస్ట్రీస్ పాస్టర్ గా పనిచేస్తూ సామాజికసేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ ఇంటికి వచ్చిన టీడీపీ యువనేతకు రూఫస్ కుటుంబ సభ్యులు ఆప్యాయతతో స్వాగతం పలికారు. 

మంగళగిరిలో ఓటమిపాలైనప్పటికీ గత నాలుగున్నరేళ్లుగా మీలో ఒకడిగా ఉంటూ సొంత నిధులతో సేవలందిస్తున్నానని, మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి సహకారం అందించాల్సిందిగా లోకేశ్ వారిని కోరారు.

More Telugu News