Revanth Reddy: రూ.2 వేల కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్‌ శిక్షణ ఇవ్వడానికి టాటా సంస్థ సంసిద్ధత.. స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి

  • టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
  • కాలం చెల్లిన కోర్సుల స్థానంలో ఆధునిక కోర్సులు ప్రవేశపెట్టవలసి ఉందన్న సీఎం 
  • దాదాపు లక్ష మంది విద్యార్థులు శిక్షణ పొందే అవకాశం ఉందన్న రేవంత్    
CM Revanth Reddy held a meeting with the representatives of Tata Technologies Ltd

పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ అవసరమని... కాలం చెల్లిన కోర్సుల స్థానంలో ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టవలసి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రూ.2వేల కోట్లతో తెలంగాణలో స్కిల్ డెవలప్‌మెంట్‌ శిక్షణ ఇవ్వడానికి కంపెనీ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... లక్షమందికి శిక్షణ ఇచ్చేందుకు టాటా టెక్నాలజీస్ ముందుకు రావడం స్వాగతిస్తున్నామన్నారు.

కాలం చెల్లిన కోర్సుల స్థానంలో ఆధునిక కోర్సులు ప్రవేశపెట్టవలసి ఉందని చెప్పారు. కోర్సులు పూర్తికాగానే ఉద్యోగం, ఉపాధి లభించేలా ఉండాలని పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీ పడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని సూచించారు. కాలం చెల్లిన కోర్సులతో యువత సమయాన్ని, విద్యను వృథా చేయకుండా అధునాతన కోర్సుల్లో శిక్షణ తీసుకోవాలన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు. రాష్ట్రంలోని 50 ప్రభుత్వ ఐటీఐల్లో రూ.1500 నుంచి రూ.2వేల కోట్లతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ అందించడానికి టాటా టెక్నాలజీస్ ముందుకు రావడాన్ని సీఎం స్వాగతించారు.

కాగా, టాటా సంస్థ... రాష్ట్రంలో 4.0 స్కిల్లింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణకు కావాల్సిన మిషనరీ, పరికరాలను, సాఫ్ట్‌వేర్‌ను అందివ్వనుంది. రాష్ట్రంలో దాదాపు లక్ష మంది విద్యార్థులు శిక్షణ పొంది పలు పరిశ్రమలో ఉద్యోగాలు పొందే విధంగా తగు శిక్షణ అందించడానికి టాటా సంస్థ ముందుకు రావడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. టాటా సంస్థతో తమ ప్రభుత్వం కలిసి పని చేస్తుందని.. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంఓయూను కుదుర్చుకునేందుకు ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు.

More Telugu News