Chatradurga Suicide Case: ఒకే ఇంట్లో ఐదు అస్థిపంజరాలు.. ఐదేళ్ల తర్వాత వెలుగులోకి!

  • కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘటన
  • 2019లో చివరిసారి కనిపించిన కుటుంబం
  • మృతులందరూ 55 ఏళ్లు పైబడినవారే
  • హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు
  • విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
Skeletons Of 5 Found In Locked Karnataka Home Last Seen In 2019

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఘోరం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తాళం వేసి ఉన్న ఇంట్లో ఐదుగురి అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరిని ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగన్నాథ్‌రెడ్డి (85), ఆయన భార్య ప్రేమ (80), కుమార్తె త్రివేణి (62), కుమారులు కృష్ణ (60), నరేంద్ర (57)గా గుర్తించారు. పోస్టుమార్టం తర్వాత కానీ వారి మృతికి గల కచ్చితమైన కారణం చెప్పలేమని పోలీసులు తెలిపారు. వీరు చివరిసారి 2019లో కనిపించారని, ఆ తర్వాతి నుంచి ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. 

స్థానికంగా చాలాకాలంగా తాళం వేసి కనిపిస్తున్న ఇంటి గురించి స్థానికుడు ఒకరు గురువారం మీడియాకు తెలియజేయగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. అదే రోజు సాయంత్రం పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన పరిచయస్తులు, బంధువులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్నాథ్‌రెడ్డి కుటుంబం ఏకాంత జీవితం గడుపుతున్నట్టు తెలుసుకున్నారు. వారందరూ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. చివరిసారి వారు జూన్-జులై 2019లో కనిపించినట్టు తెలిపారు. 

ఆ ఇంట్లో 2019 సంవత్సరం నాటి క్యాలెండర్ వేలాడిదీసి ఉండడంతో ఘటన అదే ఏడాది జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి ఆ ఇంటి వైపు ఎవరూ వెళ్లకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదని వివరించారు. నాలుగు అస్థిపంజరాల్లో రెండు మంచంపైన, రెండు నేల మీద పడివున్నట్టు పోలీసులు తెలిపారు. మరో గదిలో మరో అస్థిపంజరాన్ని గుర్తించారు. వారి మృతికి కచ్చితమైన కారణం తెలియదని అయితే, ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అటాప్సీ తర్వాత అసలు విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి జి. పరమేశ్వర విచారణకు ఆదేశించారు. 

బికనీర్‌లోనూ అదే ఘటన 
ఈ నెల 14న రాజస్థాన్‌లోని బికనీర్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. బంధువులకు వీరు దూరంగా ఉంటున్నట్టు  గుర్తించారు. వీరందరూ విషం తీసుకుని మరణించారు. కాగా, బికనీర్‌ రేంజ్‌లో ఈ ఏడాది 1,306 ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి.

More Telugu News