Bengaluru: బెంగళూరు, కోల్‌కతా నగరాల నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్స్: ఎయిర్ ఇండియా

  • జనవరి 17 నుంచి సర్వీసులు ప్రారంభమవుతాయని వెల్లడి
  • అయోధ్యకు కనెక్టివిటీ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఎయిర్ ఇండియా
  • అయోధ్య-ఢిల్లీ రూట్‌లో నాన్-స్టాప్ సర్వీసులు నడపనున్నట్టు గతంలోనే ప్రకటన
  • ప్రధాని మోదీ చేతుల మీదుగా నేడు అయోధ్యలోని వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
Direct flights from Bengaluru and Kolkata to Ayodhya says Air India Express

అయోధ్యలోని ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయోధ్య ధామ్’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (శనివారం) ప్రారంభించనున్న వేళ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కీలక ప్రకటన చేసింది. బెంగళూరు, కోల్‌కతా నగరాల నుంచి నేరుగా అయోధ్యకు విమానాల సర్వీసులు నడపనున్నట్టు వెల్లడించింది. జనవరి 17 నుంచి సర్వీసులు ప్రారంభమవుతాయని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. 

ఈ రూట్లలో నాన్‌స్టాప్ విమానాలను ప్రవేశపెట్టనున్నామని, తద్వారా అయోధ్యకు కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తమ నెట్‌వర్క్‌లో బెంగళూరు, కోల్‌కతా నగరాలు అయోధ్యకు గేట్‌వేలుగా ఉంటాయని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ డాక్టర్ అంకుర్ గార్గ్ పేర్కొన్నారు. దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల నుంచి అయోధ్యకు వెళ్లే యాత్రికులు ఇక్కడ నుంచి వన్-స్టాప్ ప్రయాణాలు చేయొచ్చని సూచించారు. ఎయిర్‌లైన్ మొబైల్ యాప్, వెబ్‌సైట్, ఇతర బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ మీద టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

కాగా అయోధ్య - ఢిల్లీ మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ నడపనున్నట్టు ఇదివరకే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. మహర్షి వాల్మీకి ఎయిర్‌పోర్టు ప్రారంభం రోజయిన శనివారం అయోధ్య - ఢిల్లీ మధ్య ప్రారంభ సర్వీసులు నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక విమాన సర్వీసుల సమయం విషయానికి వస్తే డిసెంబర్ 30న ప్రారంభ విమాన సర్వీసు ఐఎక్స్ 2789 ఢిల్లీ నుంచి 11 గంటలకు బయలుదేరి 12:20 గంటలకు అయోధ్యలో ల్యాండ్ అవుతుంది. అయోధ్యలో ఐఎక్స్ 1769 సర్వీస్ 12:50 గంటలకు ఢిల్లీకి బయలుదేరి 14:10 గంటలకు చేరుకుంటుంది.

ఇక జనవరి 17న బెంగళూరు-అయోధ్య రూట్‌లో షెడ్యూల్ ప్రకారం ఉదయం 08:05 గంటలకు బెంగళూరులో బయలుదేరి 10:35కి అయోధ్య చేరుకుంటుంది. అయోధ్య నుంచి 15:40కి బయలుదేరి 18:10కి బెంగళూరు చేరుకుంటుంది. అయోధ్య-కోల్‌కతా రూట్‌లో అయోధ్య నుంచి 11:05కి బయలుదేరి 12:50 గంటలకు కోల్‌కతాలో ల్యాండ్ అవుతుంది. కోల్‌కతా నుంచి అయోధ్యకు తిరుగు ప్రయాణం 13:25 గంటకి మొదలయ్యి 15:10 గంటలకుకి అయోధ్యకు చేరుకుంటుందని షెడ్యూల్ తెలుపుతోంది. ఈ మేరకు  మూడు వారాల నాన్‌స్టాప్ విమానాల షెడ్యూల్‌ను ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.

More Telugu News