WTC points table: తొలి టెస్టులో ఘోర ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారీగా దిగజారిన భారత్

With a heavy defeat in the first Test India has fallen to 5th place in the WTC points table
  • నాలుగు స్థానాలు దిగజారి 5వ స్థానానికి పడిపోయిన టీమిండియా
  • అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా
  • సెంచూరియన్ టెస్టు ఫలితంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు
సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి పాలవ్వడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ భారీగా దిగజారింది. పాయింట్లు 66.67 నుంచి 44.44కి పడిపోవడంతో నాలుగు స్థానాలు దిగజారి 5వ స్థానానికి పడింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా కంటే కాస్త ముందంజలో ఉన్నప్పటికీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో పాకిస్థాన్‌పై ఆసీస్ విజయం సాధిస్తే స్థానాలు మారిపోవడం ఖాయం. 

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ వరుస స్థానాల్లో నిలిచాయి. కాగా సెంచూరియన్ టెస్టులో భారత్ దారుణరీతిలో ఓటమిపాలైంది. ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. డబ్ల్యూటీసీ 2023-25లో దక్షిణాఫ్రికాకు ఇదే మొదటి సిరీస్‌ కావడం గమనార్హం. దీంతో ఆ జట్టుకు 12 పాయింట్లు దక్కాయి. పాయింట్ల శాతం అన్ని జట్ల కంటే మెరుగ్గా ఉండడంతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

గత రెండేళ్ల వ్యవధిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో భారత్ ఒక టెస్టు మాత్రమే గెలిచింది. ఇంగ్లండ్‌లో ఈ ఏడాదే జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌‌లో భారత్ ఓటమిపాలైంది. ఇక 2021లో సెంచూరియన్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత దక్షిణాఫ్రికాలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్‌లో కేప్ టౌన్ వేదికగా జరగనున్న చివరిదైన రెండో టెస్టులో గెలిచి సిరీస్‌‌ను సమం చేసుకుంటుందా, కనీసం డ్రా చేసుకోగలదా? అనేది వేచిచూడాలి.
WTC points table
India vs South africa
Cricket
Team India

More Telugu News