Vyuham Movie: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు.. మరోసారి ‘వ్యూహం’ సినిమా విడుదల వాయిదా

  • గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
  • సెన్సార్ సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడి
  • ‘వ్యూహం’ విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ 11కు వాయిదా
Vyuham Movie release Once again postponed by Telangana high Court

విడుదలకు కొన్ని గంటల ముందు ‘వ్యూహం’ సినిమాకు మరోసారి బ్రేక్ పడింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలను తాత్కాలికంగా  నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘వ్యూహం’ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ ఆధారంగా సినిమాను విడుదల చేయడానికి వీల్లేదని రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సినిమా సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొంది. 

‘వ్యూహం’ విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జనవరి 11కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. కాగా వ్యూహం విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో గురువారం ఉదయం 11.45 గంటల నుంచి సాయంత్రం దాకా సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాదనలను పరిశీలించిన జడ్జి జస్టిస్‌ నంద రాత్రి 11.30 సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సర్టిఫికెట్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు చెప్పారు.

కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠను దిగజార్చేలా ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కించారని టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా విడుదలకు కేంద్ర సెన్సార్‌ బోర్డు అనుమతించడాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సూరేపల్లి నంద గురువారం విచారణ చేపట్టారు. లోకేశ్ తరపున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధర్‌రావు, ఉన్నం శ్రవణ్‌కుమార్‌లు వాదనలు వినిపించారు. నిర్మాతల తరపున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదించారు. కేవలం ట్రయలర్‌ చూసి కోర్టును ఆశ్రయించి సినిమాను నిలిపివేయాలని కోరడం సరికాదన్నారు. 10 మందితో కూడిన కమిటీ సినిమాను పరిశీలించి కొన్ని అంశాలను తొలగించాలని సూచించిందని చెప్పారు.

More Telugu News