Chandrababu: కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా: చంద్రబాబు

  • కుప్పంలో చంద్రబాబు పర్యటన
  • గుడిపల్లెలో రోడ్ షో
  • కుప్పం తన సొంత ఊరు వంటిదన్న చంద్రబాబు
  • వైసీపీ సినిమా అయిపోయిందని స్పష్టీకరణ
  • ఇక వారికి 100 రోజులే మిగిలున్నాయని వెల్లడి
Chandrababu says he will win in Kuppam with one lakh votes majority

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో మూడ్రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సాయంత్రం గుడిపల్లెలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. తాను ఎప్పుడు వచ్చినా గుడిపల్లె ప్రజలు ఎంతో ఆదరిస్తారని తెలిపారు. కుప్పం తన సొంత గడ్డ వంటిదని, ఇక్కడి వారిని తన కుటుంబంగా భావిస్తానని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు 35 ఏళ్లుగా తనను కుటుంబ సభ్యుడిగా భావించి ప్రేమాభిమానాలు కనబరుస్తారని వివరించారు. 

ఈసారి తనకు కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. ఈసారి ఎన్నికల్లో తాము లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. తనకు లక్ష ఓట్ల మెజారిటీ రావాలంటే కుప్పం నియోజకవర్గానికి గుండెకాయ వంటి గుడిపల్లెలో మొత్తం ఓట్లన్నీ టీడీపీకే పడాలని పిలుపునిచ్చారు. 

"ఇవాళ నేను ఇక్కడికి వచ్చింది నేనేదో ముఖ్యమంత్రిని కావడానికి కాదు, మళ్లీ కుప్పం ఎమ్మెల్యే అనిపించుకోవడానికి కాదు. అరాచకాలకు, అహంకారానికి, నియంతృత్వానికి చరమగీతం పాడడమే నా లక్ష్యం. నాలాంటి వాడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? దార్లో వస్తుంటే... కుప్పంలో రౌడీయిజం పెరిగిపోయింది సార్... మీరే చూసుకోవాలని చెప్పారు. 

ఇప్పుడు చెబుతున్నా... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది. మరో 100 రోజులే వారికి మిగిలున్నాయి. ఇప్పటికే వారు 100 తప్పులు చేశారు... మిడిసిపడొద్దండీ... మీరు చేసిన అవినీతిని కక్కిస్తా... పిచ్చపిచ్చగా ఉంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తా. 

పోలీసు సోదరులు కూడా ఇక్కడే ఉన్నారు... మీకు కూడా నేనే దిక్కు... ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు కూడా ముందుకు రావాలి. ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో ఇప్పటికే క్రియాశీలకం అయింది. ఇక జరిగే కార్యక్రమాలన్నీ ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి... పోలీసులు ఎన్నికల సంఘం కింద పనిచేస్తున్నారు... అంతే తప్ప సైకో ముఖ్యమంత్రి కింద కాదు" అని వివరించారు. 

ఇక, తమ మేనిఫెస్టో  అంశాలను కూడా చంద్రబాబు వెల్లడించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఇస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. టీడీపీ వచ్చాక మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.

More Telugu News