జగన్ రెడ్డి ఎంత మోసగాడో ప్రజలకు తెలియజేయడానికే ఈ పుస్తకం తీసుకువచ్చాం: అచ్చెన్నాయుడు
- సీఎం జగన్ పై విమర్శనాత్మక పుస్తకం విడుదల చేసిన టీడీపీ
- మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పుస్తకం విడుదల
- హాజరైన అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ అగ్రనేతలు
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, జగన్ రెడ్డి ఎంత మోసగాడో, ఎంత పచ్చి అబద్ధాలకోరో ప్రజలకు తెలియచేయడానికే ఈ పుస్తకం తీసుకొచ్చామని వెల్లడించారు. జగన్ రెడ్డి మోసాలను ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తెలియచేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే పార్లమెంటు స్థానాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించి జగన్ రెడ్డి వంచనను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని తెలిపారు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ప్రచారం చేసిన జగన్ రెడ్డి హామీలన్నీ జనం ముందు ఉంచుతామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
"పచ్చి అబద్ధాలు, మోసాలకు నిలువెత్తు ప్రతిరూపం జగన్ రెడ్డి అని ప్రజలకు తెలియాలి. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని ప్రతిపక్షనేతగా గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రాకముందు ఎన్ని హామీలు ఇచ్చి, ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని నెరవేర్చాడో ప్రజలు తెలుసుకోవాలి.
తన మేనిఫెస్టో బైబిల్ తో సమానమని చెప్పుకునే జగన్ రెడ్డి... మేనిఫెస్టోలోని అంశాలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. మాటమీద నిలబడకుంటే పదవికి రాజీనామా చేయాలని గతంలో ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి... ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయనందుకు లెంపలేసుకొని, తప్పుఒప్పుకొని తక్షణమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి" అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.