AITUC: సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం

  • 11 డివిజన్లలో ఐదింటిని గెలిచిన సీపీఐ అనుబంధ సంఘం
  • ఉమ్మడి ఖమ్మంలో క్లీన్ స్వీప్‌ చేయడంతో ఆరు డివిజన్లలో ఐఎన్‌టీయూసీ విజయం
  • ప్రభావం చూపలేకపోయిన బీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌
AITUC won 6 divisions in the Singareni election

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీ ఘనవిజయం సాధించింది. మొత్తం 11 డివిజన్లకు ఎన్నికలు జరగగా ఐదింటిని గెలుచుకుంది. అన్ని డివిజన్లలో కలిపి మూడు వేల పైచిలుకు మెజారిటీ సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్‌ డివిజన్లలో, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోల్‌బెల్ట్‌ ప్రాంతం రామగుండం-1, రామగుండం-2 డివిజన్లలో ఏఐటీయూసీ విజయం సాధించింది. దీంతో సింగరేణి కాలరీస్‌లో జరిగిన ఏడవ కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా అవతరించింది. 

శ్రీరాంపూర్‌ డివిజన్‌లో అత్యధికంగా 2,166 ఓట్ల మెజార్టీతో ఏఐటీయూసీ విజయం సాధించింది. బీఆర్‌ఎస్‌ అనుబంధ విభాగమైన ‘తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం’ బేషరతుగా ఏఐటీయూసీకి మద్దతు తెలపడం బాగా కలిసొచ్చింది. సింగరేణి చరిత్రలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ ఎన్నికవడం ఇది నాలుగవసారి. ఇక గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ అనుబంధ కార్మికసంఘం ఐఎన్‌టీయూసీ కొత్తగూడెం కార్పొరేట్‌, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, రామగుండం-3, భూపాలపల్లి డివిజన్లను సొంతం చేసుకుంది. దీంతో ఏఐటీయూసీకి గుర్తింపు సంఘం హోదా, ఐఎన్‌టీయూసీకి ప్రాతినిధ్య సంఘం హోదా దక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐఎన్‌టీయూసీ అన్ని స్థానాలను గెలవడం గమనార్హం. 

ఈ ఎన్నికల్లో మొత్తం 13 కార్మిక సంఘాలు పోటీ చేసినప్పటికీ ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ తప్ప ఇతర కార్మిక సంఘాలు ఒక్క డివిజన్‌ను కూడా గెలుచుకోలేకపోయాయి. హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌, సీఐటీయూ కూడా చతికిలపడ్డాయి. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీని ఓడించాలన్న లక్ష్యంతో ఏఐటీయూసీకి మద్దతు ఇవ్వడంతో ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్ కనుమరుగైంది.  2012, 2017లో సింగరేణి గుర్తింపు సంఘంగా కొనసాగిన ఆ పార్టీ ఇప్పుడు ఒక్క డివిజన్‌లో కూడా గెలవలేదు. కాగా బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. 11 డివిజన్లలో ఎన్నికలు జరగగా 94.15 శాతం పోలింగ్‌ నమోదయింది. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

More Telugu News