Kantakapalli train accident: మానవ తప్పిదం కారణంగానే కంటకాపల్లి రైలు ప్రమాదం!

  • విచారణలో కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నిర్ధారించినట్టుగా సమాచారం
  • బాధ్యులైన రైల్వే అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచన
  • ప్రమాదానికి కారణమైన రాయగడ రైలు గంటకు 92 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు వెల్లడి
Kantakapalli train accident due to human error

మానవ తప్పిదం కారణంగానే అక్టోబర్ 29న కంటకాపల్లి-అలమండ స్టేషన్ల మధ్య రైలుప్రమాదం జరిగినట్టు కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్ఎస్) నిర్ధారించినట్టు సమాచారం. తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంపై విచారణ పూర్తి చేసి రైల్వే బోర్డుకు సమగ్ర నివేదికను అందించినట్టుగా తెలుస్తోంది. సిగ్నల్‌ అండ్‌ టెలికాం, ఆపరేటింగ్‌ తదితర విభాగాల అధికారులతో పాటు కంటకాపల్లి స్టేషన్‌ అధికారులను ప్రమాదానికి బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవాలని రిపోర్ట్ సూచించినట్టు తెలుస్తోంది. ఇందుకు రైల్వే అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ అంశంపై వాల్తేర్‌ రైల్వే అధికారులు నోరువిప్పడం లేదు.

మరోవైపు ప్రమాదం జరిగిన రోజు ఉదయం నుంచి సిగ్నల్‌కు సంబంధించిన పనుల కారణంగా రైళ్లు ప్రయాణించే వేగంపై పరిమితిని విధించినట్టు విచారణలో నిర్ధారణ అయ్యింది. ఇక ప్రమాదానికి కారణమైన రాయగడ రైలు గంటకు 92 కిలో మీటర్ల వేగంతో నడిచినట్టు గుర్తించారు. అయితే ఈ రైలు పైలట్‌, అసిస్టెంట్‌ పైలట్‌ ప్రాణాలు కోల్పోవడంతో అంత వేగంగా వెళ్లడానికి కారణాలు తెలియలేదు. ఇదిలావుంచితే కంటకాపల్లి రైలు ప్రమాదంలో 14 మంది చనిపోగా 50 మందికిపైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

More Telugu News