Mallu Bhatti Vikramarka: అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణకు సాయం చేయాలని ప్రధాని మోదీని కోరాం: మల్లు భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka after meeting with PM Modi
  • ప్రధానితో దాదాపు గంటపాటు సీఎం రేవంత్, మల్లు భట్టి విక్రమార్క సమావేశం
  • తెలంగాణ ప్రయోజనాల కోసమే మోదీని కలిశామన్న మల్లు భట్టి
  • బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అంశాల ప్రస్తావన
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ప్రధాని నరేంద్ర మోదీని కలిశామని, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి సాయం చేయాలని కోరామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్లు భట్టి ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో ప్రధానిని కలిశారు. దాదాపు గంటపాటు వారు వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానితో భేటీ అనంతరం మల్లు భట్టి మీడియాతో మాట్లాడుతూ... విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం... కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాల్సి ఉందన్నారు. ప్రధానితో చర్చ సందర్భంగా వివిధ అంశాలను ప్రస్తావించినట్లు తెలిపారు.

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. విభజన చట్టం ప్రకారం ఓ భారీ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరినట్లు తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరామన్నారు. తెలంగాణకు ఐఐఎం, సైనిక్ స్కూల్ మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని మల్లు భట్టి అన్నారు. బీఆర్ఎస్ నేతల ఆర్థిక అరాచకం కారణంగా తెలంగాణ అప్పులపాలైందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు సాయం చేయాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
Mallu Bhatti Vikramarka
Revanth Reddy
Narendra Modi
Congress

More Telugu News