Hafeez saeed: పాక్ ఎన్నికల్లో ఉగ్రవాది కొడుకు పోటీ

  • హఫీజ్ సయీద్ కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీ
  • ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్
  • ఫిబ్రవరి 24న పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు 
Mumbai Attacks Mastermind Hafeez Saeed Son In Pakistan Election

పాకిస్థాన్ లో ఫిబ్రవరి 24న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన పాక్ ఎన్నికల కమిషన్.. అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తోంది. ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దాదాపు ఐదేళ్ల తర్వాత తిరిగి పాక్ లో అడుగుపెట్టారు. ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాది హఫీజ్ మహ్మద్ సయీద్ కొడుకు కూడా ఎన్నికల బరిలో నిలుచున్నాడు. పాకిస్థాన్ మర్కజి ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) పార్టీ తరఫున లాహోర్ నుంచి ఇతను నామినేషన్ దాఖలు చేశాడు.

పీఎంఎంఎల్ పార్టీ వెనక హఫీజ్ సయీద్ ఉన్నాడని, గతంలో నిషేధానికి గురైన మిల్లి ముస్లిం లీగ్ పార్టీ మూలాల నుంచే ఇది ఆవిర్భవించిందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా పోటీకి పీఎంఎంఎల్ అభ్యర్థులను దించింది. ఇందులో భాగంగానే హఫీజ్ కొడుకు తల్హా సయీద్ లాహోర్ లోని ఎన్ఏ-127 నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. కాగా, హఫీజ్ సయీద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ప్రకటించింది. ముంబై పేలుళ్ల సూత్రధారి అని భారత్ ఆరోపించినా, ఆధారాలు చూపినా హఫీజ్ ను పాక్ అప్పగించలేదు.

ఉగ్రవాదానికి నిధుల సేకరణకు సంబంధించిన కేసులో 2019లో అరెస్ట్ అయిన హఫీజ్.. ఇప్పటికీ జైలులోనే ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి 2022 లో కోర్టు హఫీజ్ ను దోషిగా తేల్చి, శిక్ష విధించింది. హఫీజ్ కొడుకు తల్హా సయీద్ కు కూడా లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని, లష్కరే క్లెరిక్ విభాగానికి తల్హా అధిపతి అని భారత్ ఆరోపిస్తోంది. ఉగ్రవాదంతో లింక్ ఉన్న వ్యక్తి ప్రస్తుతం పాక్ ఎన్నికలలో పోటీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

More Telugu News