Himachal Pradesh: ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకునేందుకు నదిలోకి కారును పోనిచ్చిన డ్రైవర్.. వీడియో ఇదిగో!

  • క్రిస్మస్ వేడుకల కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీకి పోటెత్తిన పర్యాటకులు
  • లహూల్-మనాలీ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్
  • ట్రాఫిక్ జాం నుంచి తప్పించుకునేందుకు నదిలోకి కారు పోనిచ్చిన డ్రైవర్
  • ఘటన వీడియో నెట్టింట వైరల్, డ్రైవర్‌పై కేసు నమోదు
Tourist Drives Mahindra Thar SUV Through River To Beat Himachal Traffic Jam

క్రిస్మస్ వేడుకల కోసం పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్‌కు పోటెత్తుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ట్రాఫిక్ జంఝాటం నుంచి తప్పించుకునేందుకు ఏకంగా నదిలోకి కారును పోనిచ్చాడు. లాహుల్ వ్యాలీలోని చంద్రానదిలో మహీంద్రా థార్ ఎస్‌యూవీ ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఘటన సమయంలో నదిలో నీరుపెద్దగా లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే, డ్రైవర్ నిర్లక్ష్య పూరిత వైఖరిపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరోవైపు, ఈ వీడియో పోలీసుల దృష్టికి కూడా వెళ్లడంతో నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ చేసినందుకు సదరు డ్రైవర్‌పై మోటార్ వాహనాల చట్టం-1988 కింద కేసు నమోదైంది. 

కాగా, పర్యాటకులు పోటెత్తడంతో లాహుల్-మనాలీ రూట్లో భారీ రద్దీ నెలకొంది. రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ గుండా గత మూడు రోజుల్లో ఏకంగా 55 వేల వాహనాలు ప్రయాణించాయి. పర్యాటకుల రద్దీని తట్టుకోవడం ప్రభుత్వ యంత్రాంగానికి సవాలుగా మారింది.

More Telugu News