Revanth Reddy: అధికారులపై ఎలాంటి వివక్ష ఉండదు... బాధ్యతగా పనిచేయండి: సీఎం రేవంత్ రెడ్డి

  • జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
  • ప్రజలతో మమేకం అవ్వాలని అధికారులకు సూచన
  • నేతలకు ఐదేళ్లే... అధికారులకు 35 ఏళ్ల సర్వీసు ఉంటుందని వెల్లడి
  • బాధ్యతతో మెలగాలని పిలుపు
CM Revanth Reddy held meeting with district collectors and police superintendents

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులపై ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. 

"మీరు వివిధ రాష్ట్రాల్లో పుట్టి పెరిగి, ఆలిండియా సర్వీసు పోటీ పరీక్షలు రాసి ఐఏఎస్ లు, ఐపీఎస్ లుగా సెలెక్ట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుని ఇక్కడికి వచ్చారు. ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర నిర్మాణంలో పాలుపంచుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడి పౌరులతో మమేకం అయ్యారు. 

మాది వేరే రాష్ట్రం అనో, మా భాష వేరు అనో మీరెవరూ భావించాల్సిన పనిలేదు. మేమెవరం కూడా మిమ్మల్ని ఆ కోణంలో చూడడంలేదు, ఎలాంటి వివక్ష చూపించడంలేదు. మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి, ప్రజల మనసులు గెలవండి. 

రాజకీయనేతలకు ఐదేళ్లే కాలపరిమితి, మీకు 35 ఏళ్ల సర్వీసు ఉంటుంది. అన్ని సంవత్సరాల సర్వీసును మీకందిస్తున్నారంటే, మీరు ఎంత జవాబుదారీతనంతో వ్యవహరించాలో అర్థం చేసుకోండి. 

కొంతమంది అధికారులు బదిలీ అయి వెళ్లిపోతున్నప్పుడు ప్రజలు సన్మానం చేయడం చూస్తుంటాం... ఓ మంచి అధికారిని ప్రభుత్వం బదిలీ చేస్తోందని కన్నీరు పెట్టుకుంటారు. మీరు కూడా ప్రజల్లో నమ్మకం పొందేలా పనిచేయండి. మీరు తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా బాధ్యతతో మెలగండి" అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

More Telugu News