Karnataka govt: బెంగళూరు విమానాశ్రయంలో రూ.10లకే భోజనం

  • ఎయిర్‌పోర్టులో రెండు ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కర్ణాటక కేబినెట్
  • రూ.10లకే భోజనం, రూ.5లకే టిఫిన్ అందించాలని నిర్ణయించిన సిద్దరామయ్య ప్రభుత్వం
  • త్వరలోనే ప్రారంభం కానున్న క్యాంటీన్లు
Meal at just rs 10 at Bangalore airport decided by Karnataka gov

సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సామాన్యులు కొనే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రూ.10లకే భోజనం, రూ.5లకే టిఫిన్ అందించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. ‘ఇందిరా క్యాంటీన్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 

ఖరీదైన ఫుడ్ అవుట్‌లెట్లలో కూడా సామాన్యులు, మధ్యతరగతి వారికి ఆహారం అందించాలన్న లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న ‘ఇందిరా క్యాంటీన్’ లో భాగంగా ఎయిర్‌పోర్టులోని పార్కింగ్ ప్రదేశంలో 2 క్యాంటీన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే వాటిని ప్రభుత్వం ప్రారంభించనుంది. కాగా బెంగళూరు నగరంలో 175కి పైగా ఇందిరా క్యాంటీన్‌లు ఉన్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇందిరా క్యాంటీన్‌లలో కేవలం రూ. 5కే అల్ఫాహారం, రూ. 10కే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలావుంచితే కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో జీవన వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో కప్పు టీ లేదా కాఫీకి రూ. 200 నుంచి రూ. 500 వరకు పలుకుతాయి. ఇక భోజనం చేయాలనుకుంటే రూ. 500-1,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇందిరా క్యాంటీన్లు సామాన్యులు, మధ్య తరగతివారికి ఉపశమనం కలిగించనున్నాయి.

More Telugu News