Kolkata Knight Riders: రూ.50 లక్షలకే కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకోవడంపై పేసర్ చేతన్ సకారియా స్పందన

  • తక్కువ ధర పలకడం కాస్త నిరాశ కలిగించిందన్న యంగ్ పేసర్
  • ఎక్కువ అవకాశాలు కల్పించే జట్టులో చోటు దక్కాలని కోరుకున్నానని వెల్లడి
  • ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిందని వ్యాఖ్య
Pacer Chetan Sakaria reaction on getting Kolkata Knight Riders for Rs 50 lakh

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2024 వేలంలో బౌలర్లకు భారీ డిమాండ్ కనిపించింది. రికార్డు స్థాయిలో మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 24.75 కోట్లకు, పాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లకు దక్కించుకున్నాయి. ఇక హర్షల్ పటేల్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 11.75 కోట్లకు, యశ్ దయాల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.5 కోట్ల‌కు కొనుగోలు చేసింది. దీనిని బట్టి ఐపీఎల్ 2024 వేలంలో బౌలర్ల కోసం ఫ్రాంచైజీలు ఎంతలా పోటీ పడ్డాయో అర్థం చేసుకోవచ్చు. కానీ గత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన లెఫ్ట్‌ఆర్మ్ పేసర్ చేతన్ సకారియాను తాజాగా ముగిసిన వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం రూ. 50 లక్షలకే దక్కించుకుంది. ఈ పరిణామంపై పేసర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

ఇంత తక్కువ ధరకే కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకోవడం షాకింగ్ అనిపించలేదని, కానీ కాస్త నిరాశకు గురయ్యానని సకారియా చెప్పాడు. వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేయడంపై స్పందిస్తూ.. జట్టు కోణంలో వారు సరైన నిర్ణయమే తీసుకున్నారని అన్నాడు. తన నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన రాలేదని, బహుశా తనకు తాను న్యాయం చేసుకోలేకపోయానేమోనని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ వంటి భారతీయ పేసర్లు ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉన్నారు. మైదానంలో పెద్దగా రాణించలేకపోవడంతో సహజంగానే తాను బెంచ్‌కు పరిమితమయ్యానని చేతన్ సకారియా చెప్పాడు. ఈ మేరకు ‘స్పోర్ట్స్ కీడా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నాడు.

వేలం జరుగుతున్న సమయంలో తన మనసులో ఒక కోరిక ఉందని, ఆడేందుకు ఏ జట్టులో ఎక్కువ అవకాశాలు లభిస్తాయో ఆ జట్టుకు ఎంపిక అవ్వాలని కోరుకున్నానని సకారియా చెప్పాడు. అయితే రెండు జట్లు మాత్రమే తనను తీసుకోవాలని చూశాయని, అందులో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒకటని అన్నాడు. డబ్బు‌ను పట్టించుకోనని, ఆడేందుకు జట్టులో చోటు దక్కితే చాలని భావిస్తున్నట్టు సకారియా వివరించాడు.

ఇక బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ నుంచి తాను చాలా నేర్చుకున్నానని, అతడితో చాలా మాట్లాడానని చెప్పాడు. ప్రీ బంతిని ఎలా ప్లాన్ చేయాలి, ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్లను ఎలా వినియోగించుకోవాలి అనే విషయాల గురించి ముస్తాఫిజుర్ తనకు చెప్పాడని వివరించాడు. మిచెల్ స్టార్క్ నుంచి చాలా నేర్చుకున్నానని భావిస్తున్నానని చెప్పాడు. కాగా సకారియా భారత్ తరపున ఒక వన్డే,  2 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2022‌కు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని ఏకంగా రూ. 4.20 కోట్లకు దక్కించుకుంది. కానీ ఐపీఎల్ 2024 వేలానికి ముందు విడుదల చేసిన విషయం తెలిసిందే.

More Telugu News