Bandi Sanjay: సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్... నేను, రేవంత్ రెడ్డి, హరీశ్ రావూ బాధితులమే: బండి సంజయ్

  • ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న బండి సంజయ్
  • పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు రాధాకిషన్ రావు చెప్పారన్న బీజేపీ నేత
  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కేసీఆర్, కేటీఆర్‌లకు సంబంధం ఉందని ఆరోపణ
Bandi Sanjay on Phone Tapping issue

సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని... తనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా దీని బాధితులేనని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు, రిమాండ్‌లు జరిగాయన్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు చూస్తున్నారని, ఇందులో కరీంనగర్ మంత్రి హస్తం కూడా ఉందని ఆరోపించారు.

చాలా ఆరోపణలపై సిట్‌లు వేయడం, మూసివేయడం సాధారణంగా మారిందన్నారు. ఇది దేశభద్రతకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో రాధాకిషన్ రావు చెప్పారని వెల్లడించారు. తన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. 317 జీవో, టీఎస్‌పీఎస్సీ సమయంలో తనను అరెస్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగే కారణమన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కేసీఆర్, కేటీఆర్‌కు సంబంధం ఉందని ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందు వాస్తవాలను ఎందుకు పెట్టడం లేదు? అని ప్రశ్నించారు. ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నట్లేనని ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు.

More Telugu News