Roja: లోకేశ్ చేసింది కూడా ఒక పాదయాత్ర అంటారా?: రోజా వ్యంగ్యం

  • యువగళం పాదయాత్ర చేసిన నారా లోకేశ్
  • పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉందని రోజా వ్యాఖ్యలు
  • లోకేశ్ ది ఐరన్ లెగ్ అంటూ విమర్శలు
Roja slams Nara Lokesh Yuvagalam Padayatra

టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన యువగళం పాదయాత్రపై ఏపీ మంత్రి రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నారా లోకేశ్ చేసిన దాన్ని కూడా పాదయాత్ర అంటారా? అని ఎద్దేవా చేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, జగనన్న పాదయాత్రను చూసి లోకేశ్ కూడా ఏదో చేయాలని ప్రారంభించాడని వ్యాఖ్యానించారు. 

నారా లోకేశ్ ది ఎంత ఐరన్ లెగ్గో పాదయాత్ర మొదటి రోజే తెలిసిందని అన్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభం రోజునే అతడి బంధువు తారకరత్న కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చినా పట్టించుకోని, భావోద్వేగాలు లేని వ్యక్తి లోకేశ్ అని రోజా విమర్శించారు. 

400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానని చెప్పిన లోకేశ్... తనకు తెలిసి వరుసగా 40 రోజులు కూడా నడిచింది లేదు అని వెల్లడించారు. వాళ్లేమో 200 రోజులు నడిచాడు అని సభలో చెప్పినట్టున్నారు... కానీ, 200 సార్లు బ్రేక్ తీసుకున్న ఏకైక ఫెయిల్యూర్ రాజకీయనాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది లోకేశ్! అని తెలిపారు. ఆయన ఇక్కడ నడిచిన దానికంటే హైదరాబాద్, ఢిల్లీ తిరిగిందే ఎక్కువని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ నాన్ లోకల్  రాజకీయ నాయకులని రోజా అభివర్ణించారు. 2024లో నలుగురు నాన్ లోకల్స్ కి, నాలుగు కోట్ల మంది ఓటర్లకు ఎన్నికల యుద్ధం జరగబోతోందని అన్నారు. ఆ నాలుగు కోట్ల మంది ఓటర్లు ఏపీలో జగనన్న వైపే ఉన్నారని స్పష్టం చేశారు. ఆ నలుగురు నాన్ లోకల్ నేతలను తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని రోజా వ్యాఖ్యానించారు. 

ఇక, ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ట్యాబ్ లను దుర్వినియోగం చేస్తున్నారని, ట్యాబ్ లలో అశ్లీల చిత్రాలు చూస్తున్నారని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. లోకేశ్ ఏమైనా ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాడేమో, అందుకే అతడికి అన్నీ అలాంటి ఆలోచనలే వస్తుంటాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అందించిన ట్యాబ్ లలో బైజూస్ కంటెంట్ తప్ప ఇతర కంటెంట్ చూసే వీల్లేదని వివరించారు.

More Telugu News