Nara Lokesh: అయ్యో! కడప స్టీల్‌ప్లాంట్ జగన్ ఇంకా నిర్మించలేదా?: లోకేశ్ ఎద్దేవా

  • జగన్‌ మాటలు చూస్తే జబర్దస్త్‌లోని బిల్డప్ బాబాయి గుర్తొస్తారన్న లోకేశ్
  • మూడేళ్లలో కడప స్టీల్‌ప్లాంట్ నిర్మిస్తానని శిలాఫలకం వేసి నాలుగేళ్లు అయిందన్న టీడీపీ నేత
  • జగన్ దెబ్బకు లిబర్టీ స్టీల్స్ పరారైందని ఎద్దేవా
  • ఇలాంటి సీఎం ఉండగా పెట్టుబడులకు ఎవరైనా ముందుకొస్తారా? అని ప్రశ్న
TDP leader Nara Lokesh once again fires on CM YS Jagan over Kadapa Steel Plant

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. జగన్‌ మాటలను దగ్గరగా చూస్తే జబర్దస్ షోలోని బిల్డప్ బాబాయి గుర్తొస్తారని పేర్కొన్నారు. ఆయన మాటలు కోటలు దాటుతాయని, పనులు మాత్రం గడపదాటవన్నారు. జగన్ తన సొంత ఇలాకా కడప జిల్లాలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేస్తానని చెప్పి తొలి శిలాఫలకం వేసి నాలుగేళ్లు అయిందని గుర్తు చేశారు. రూ. 15 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ నిర్మించి 25 వేల మందికి ఉద్యోగం ఇస్తానని నాడు కోతలు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, తుప్పలు తొలగించేందుకు సైతం నిధులు కేటాయించకపోవడంతో లిబర్టీ స్టీల్స్ పరారైందని ఎద్దేవా చేశారు. దీంతో  జేఎస్‌డబ్ల్యూ అనే మరో కంపెనీని బతిమాలుకొని ఏడాది క్రితం మరోమారు జగన్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. మరో మూడునెలల్లో పదవీకాలం పూర్తికావస్తున్నా కడప స్టీల్‌ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదన్నారు.  పులివెందులలో రోడ్ల నిర్మాణానికి బిల్లులు ఇవ్వకపోవడంతో కంకరపర్చి తారువేయకుండా కాంట్రాక్టర్ పరారయ్యాడని పేర్కొన్నారు. ఇలాంటి దివాలాకోరు ముఖ్యమంత్రిని నమ్మి వేలకోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా? అని లోకేశ్ ప్రశ్నించారు.

More Telugu News