VV Lakshminarayana: కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • ఏపీలో కొత్త రాజకీయ పార్టీ
  • జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించిన సీబీఐ మాజీ జేడీ
  • ఇది పెట్టిన పార్టీ కాదు... పుట్టిన పార్టీ అని వెల్లడించిన లక్ష్మీనారాయణ
  • ఇప్పుడున్న పరిస్థితులు మార్చడానికి పుట్టిన పార్టీ అని స్పష్టీకరణ
Former CBI JD Lakshminarayana announced new political party Jai Bharat National Party

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తన పార్టీ పేరు జై భారత్ నేషనల్ పార్టీ అని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఐపీఎస్ కు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రజల మధ్యకు వచ్చానని తెలిపారు. అనేక వర్గాల ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని వివరించారు. సమస్యలు, పరిష్కారాలను వారినే అడిగి తెలుసుకుంటూ, రాష్ట్రం మొత్తం తిరిగి చేసిన అధ్యయనంతో రాజ్యాధికారం ముఖ్యమన్న విషయాన్ని గుర్తించానని వెల్లడించారు. ఆ విధంగా 2019 ఎన్నికల్లో పోటీ చేశానని, 3 లక్షల మంది వరకు ఓటర్లు మద్దతు పలికారని వివరించారు. 

"ఆ ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో పర్యటిస్తూ యువతను, రైతులను, కార్మికులను, మత్స్యకారులను కలిసిన తర్వాత వాళ్ల ఆలోచనలు, వాళ్ల ఆకాంక్షలు పరిశీలించాను. ఒక పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని స్థాపించిన పార్టీ ఇది. ఇది పెట్టిన పార్టీ కాదు... ప్రజల కాంక్షలు, ఆకాంక్షలు, ఆలోచనల్లోంచి పుట్టిన పార్టీ... జై భారత్ నేషనల్ పార్టీ.

మనదేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. రాజకీయాలంటే ప్రజలను మోసగించడమే అని అందరూ భావిస్తున్న పరిస్థితుల్లో... రాజకీయాలంటే సుపరిపాలన అని చాటిచెప్పడానికే జై భారత్ పార్టీతో ముందుకు వస్తున్నాం. 

రాజకీయాలు అంటే మోసం అని భావించే ప్రజల అభిప్రాయాన్ని మార్చుతాం. 2014లో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో మాట్లాడి, విభజన చట్టం వచ్చాక అందులో ఉన్న ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడలేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉండుంటే రాష్ట్రంలో ఇంత నిరుద్యోగం ఉండేది కాదేమో! 

ఒకరేమో ప్రత్యేకహోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్నారు... మరొకరు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇంకొకరు తలలు తెగిపడినా ఫర్వాలేదు కానీ, మేం పోరాడతాం అని అన్నారు. కానీ, ప్రత్యేకహోదా రాలేదు, ప్యాకేజీ అందలేదు, మెడలు వంగలేదు, తలలు తెగిపడిందీ లేదు. నిరుద్యోగం పెరిగిపోయింది, చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. 

ప్రత్యేక హోదా అడగడానికి మనకు మూడు సార్లు అద్భుతమైన అవకాశం వచ్చింది. రాష్ట్ర ఎన్నికలు జరిగిన సందర్భంగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా, ఢిల్లీ సివిల్ సర్వీసెస్ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ప్రత్యేక హోదా అడగడానికి అవకాశం ఇచ్చింది. కానీ ప్రత్యేక హోదాపై అడిగే ధైర్యం ఎవరికీ లేకపోయింది. ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో, ప్రత్యేకహోదా కోసం పోరాడతామంటూ మళ్లీ చెప్పబోతున్నారు. ఇలాంటి బూటకపు ప్రచారాలకు ముగింపు పలికి ప్రత్యేకహోదా తీసుకురావడానికి పుట్టిన పార్టీ... జై భారత్ నేషనల్ పార్టీ. 

ఎవరికీ తలవంచేది లేదు, ఎవరికీ సాష్టాంగ ప్రమాణాలు చేసేదిలేదు.... ప్రత్యేకహోదా కోసం పోరాడతామని మీ అందరి సమక్షంలో చెబుతున్నాను. ప్రభుత్వాలు చట్టంలోని, రాజ్యాంగంలోని లోపాలను వెదికి ఎలా దోచుకోవాలని ఆలోచిస్తున్నాయే తప్ప, ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలన్న తలంపు లేకపోయింది. వాళ్లు... వీరు తిన్నారు అంటారు... వీరేమో వాళ్లు కూడా తిన్నారు అంటారు. వేరొకరు తిన్నారులే అని బహిరంగంగా సభలో ప్రకటించి, ఫర్వాలేదులే అని మద్దతు ఇస్తున్నారు. ఎవరూ తినలేని వ్యవస్థ ఎలా ఉంటుందో చూపించడానికి పుట్టిన పార్టీ... జై భారత్ నేషనల్ పార్టీ. 

అవినీతిని అంతమొందించి, ఎవరూ ఒక్క రూపాయిని కూడా తినలేని విధంగా చేసే ప్రభుత్వాలు ఎలా ఉంటాయో పుట్టిన పార్టీ... జై భారత్ నేషనల్ పార్టీ. 75 ఏళ్ల కిందట దేశానికి లభించిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎంతగానో దుర్వినియోగం అయ్యాయి. మనకు మనమే బందీలుగా మారిపోయాం. పెత్తందార్లను మార్చాం గానీ, బానిసత్వం నడుస్తూనే ఉంది. ఒకరు అభివృద్ధి అభివృద్ధి అని ఒక నగరం నిర్మించడంపైనే దృష్టి కేంద్రీకరించి అవసరాలను మర్చిపోయారు. ఇంకొకరు అవసరాలు అవసరాలు అని అభివృద్ధిని పక్కకు నెట్టేశారు. అభివృద్ధితో ఎలా అవసరాలు తీర్చవచ్చో ప్రజలకు చెప్పి, బానిసత్వం నుంచి విముక్తి  కలిగించడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. 

డాలర్ తల ఎగరేస్తుంటే, తల దించుకోవాల్సిన దుస్థితికి దిగజారింది మన ఆర్థిక వ్యవస్థ. నిజానికి ప్రభుత్వాలను నిర్ణయిస్తోంది ప్రజలేనా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ అని వెతుక్కోవాల్సి వస్తోంది. దీనికి పరిష్కారం చూపడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. 

మేధావులను, ఆర్థికవేత్తలను ఉక్కు పాదాల కింద తొక్కుతున్న పరిస్థితి చూస్తున్నాం. సామాజిక బాధ్యత కలిగి సునిశిత విమర్శలు చేస్తున్నవారిని జైళ్లకు పంపిస్తున్నారు. ఇలాంటి వాటిని మనం నిస్సహాయంగా చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు, మానవ హక్కుల రక్షణ సజావుగా ఉంటే మేం రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఇవి లేవు కాబట్టి వాటిని దారిలో పెట్టడానికి పుట్టింది... జై భారత్ నేషనల్ పార్టీ" అని లక్ష్మీనారాయణ వివరించారు.

More Telugu News