Mansoor Ali Khan: చిరంజీవిపై కోర్టుకెక్కిన మన్సూర్ అలీఖాన్ కు రూ.1 లక్ష జరిమానా

  • ఇటీవల త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీఖాన్
  • త్రిషకు మద్దతు పలికిన చిరంజీవి, ఖుష్బూ
  • చిరంజీవి, ఖుష్బూపై పరువునష్టం దావా వేసిన మన్సూర్ అలీఖాన్
  • మా సమయం వృథా చేశావంటూ హైకోర్టు ఆగ్రహం
Madras High Court fined actor Mansoor Ali Khan

త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, త్రిషకు మద్దతు పలికిన చిరంజీవి, ఖుష్బూలపై పరువునష్టం దావా వేసిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కు కోర్టు భారీ జరిమానా వడ్డించింది. త్రిషతో లియో సినిమాలో తనకు రేప్ సీన్ ఉంటుందని భావించానని, కానీ ఆ సీన్ మిస్సయిపోయిందంటూ మన్సూర్ అలీఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కశ్మీర్ షెడ్యూల్ లో మరీ దారుణంగా, సెట్స్ పై త్రిషను చూసే అవకాశం కూడా కల్పించలేదని చిత్రబృందంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను చిరంజీవి, ఖుష్బూ తదితరులు తప్పు బట్టడమే కాకుండా, త్రిషకు సంఘీభావం ప్రకటించారు. దాంతో, మన్సూర్ అలీఖాన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. చిరంజీవి, ఖుష్బూ తనను మాటలతో వేధించారని పేర్కొన్నాడు. తన పరువుకు భంగం కలిగించారని, వారిద్దరూ చెరొక కోటి రూపాయలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరాడు. 

అయితే, మద్రాస్ హైకోర్టు మన్సూర్ అలీఖాన్ వ్యాజ్యంపై మండిపడింది. పరువునష్టం దావా వేసినట్టు లేదు, పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది అంటూ అక్షింతలు వేసింది! ఈ క్రమంలో అతడి పిటిషన్ ను కొట్టివేసింది. కోర్టు అంతటితో వదిలిపెట్టలేదు. తమ సమయం వృథా చేశాడంటూ మన్సూర్ అలీఖాన్ కు రూ.1 లక్ష జరిమానా విధించింది. ఆ జరిమానాను అడయార్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ కు చెల్లించాలని ఆదేశించింది.

More Telugu News