Revanth Reddy: ఈ 3 అంశాలపై అసెంబ్లీ వేదికగా జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తున్నాం: రేవంత్ రెడ్డి

We are ordering judicial inquiry on 3 matters says Revanth Reddy
  • విద్యుత్ రంగం అవకతవకలపై అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ
  • అవసరమైతే విచారణ జరిపించుకోవచ్చంటూ జగదీశ్ రెడ్డి సవాల్
  • ఛత్తీస్ గఢ్ తో విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి ప్రాజక్టులపై విచారణకు ఆదేశిస్తున్నామన్న రేవంత్

విద్యుత్ రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమ గత ప్రభుత్వంపై ప్రస్తుత ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. తప్పులు జరిగినట్టు మీరు భావిస్తుంటే జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... గౌరవ సభ్యుడే డిమాండ్ చేశారు కాబట్టి జ్యుడీషియల్ విచారణ జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అసెంబ్లీ వేదికగా చెపుతున్నా... మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయిస్తామని చెప్పారు. 

విద్యుత్ రంగంలో చోటు చేసుకున్న అవకతవకలు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలనే శ్వేతపత్రాన్ని విడుదల చేశామని రేవంత్ తెలిపారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మీ ఉద్దేశాలు ఏమిటో విచారణలో తేలుతాయని చెప్పారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. కేంద్రం తక్కువ ధరకు విద్యుత్ ఇస్తున్నా... అధిక ధరకు ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. రెండో అంశంగా 1,080 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, మూడో అంశంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై కూడా విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పారు. 

కరెంట్ అనే సెంటిమెంట్ ను గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుందని రేవంత్ మండిపడ్డారు. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై ఆనాడు ప్రశ్నించిన తమను అసెంబ్లీ నుంచి మార్షల్స్ చేత బయటకు గెంటించారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పని చేసిన విద్యుత్ నిపుణులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారని అన్నారు. 24 గంటల విద్యుత్ పంపిణీ చేశామని అబద్ధాలు చెపుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News