H1B Visa: హెచ్ 1 బి వీసా రెన్యూవల్ ఇకపై అమెరికాలోనే.. వచ్చే జనవరి నుంచే అమలు

  • అమెరికాలోని భారతీయులకు భారీ ఊరట
  • పైలట్ ప్రాజెక్టు అమలుకు అగ్రరాజ్యం గ్రీన్ సిగ్నల్
  • తొలుత 20 వేల మంది హెచ్ 1 బి వీసా హోల్డర్లకు ప్రయోజనం
Pilot for domestic renewal of H1B visa clears White House review

అగ్రరాజ్యం అమెరికాలో హెచ్ 1 బి వీసాతో ఉద్యోగం చేస్తున్న భారత సంతతి పౌరులకు భారీ ఊరట లభించనుంది. ఇకపై హెచ్ 1 బి వీసా రెన్యూవల్ కోసం ఇండియాకు రావాల్సిన అవసరం లేకుండా అమెరికా చర్యలు చేపట్టింది. వీసా నిబంధనలలో మార్పులు చేసింది. అమెరికాలోనే ఈ వీసాలను రెన్యూవల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా 20 వేల హెచ్ 1 బి వీసాలను రెన్యూవల్ చేసే ప్రక్రియకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రక్రియను అమలులోకి తీసుకు వచ్చేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అమెరికాలోని భారత సంతతి ఉద్యోగులకు ఊరట లభించనుంది.

ఈ వీసా రెన్యూవల్ కు సంబంధించి విధివిధానాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదని, ఎవరు అర్హులనే విషయం ఫెడరల్ రిజిస్టర్ నోటీసు విడుదలయ్యాకే తెలుస్తుందని బ్లూమ్ బర్గ్ లా వెల్లడించింది. ఈ ప్రాసెస్ కు సంబంధించి వైట్ హౌస్ యంత్రాంగం ఈ నెల 15న చర్చించి ఆమోదం తెలిపింది. హెచ్ 1 బి వీసా రెన్యూవల్ కోసం వీసా హోల్డర్లు ఒక్క మెయిల్ చేస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. గతంలో వీసా రెన్యూవల్ కోసం హెచ్ 1 బి హోల్డర్లు అమెరికా దాటి వెళ్లాల్సి వచ్చేది. పక్క దేశాలకు లేదా మాతృదేశానికి వెళ్లి అక్కడి నుంచి రెన్యూవల్ దరఖాస్తు చేసుకునేవారు. గత జూన్ నెలలో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించినపుడు ఈ వీసా రెన్యూవల్ కష్టాలను తప్పించేందుకు డొమెస్టిక్ రెన్యూవల్ పద్ధతిని తీసుకొస్తామని అమెరికా ప్రకటించింది.

More Telugu News