WHO: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు.. కారణం వెల్లడించిన డబ్ల్యూహెచ్ఓ

  • కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న డబ్ల్యూహెచ్ఓ
  • జీనోమ్ సీక్వెన్సింగ్ డాటా పంచుకోవాలని వెల్లడి
  • కరోనా ఎక్స్‌బీబీతో పాటూ జేఎన్.1 లాంటి వైరస్‌ల కారణంగా కేసులు పెరుగుతున్నాయని వెల్లడి
  • హాలిడే సీజన్‌ కావడంతో కరోనాతో పాటూ ఇతర రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయన్న డబ్ల్యూహెచ్ఓ
WHO on rising covid cases across the world

అనేక దేశాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు చేసింది. వ్యాధి వ్యాప్తి తీరును జాగ్రత్తగా పరిశీలించాలని, వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ సమాచారం ఎప్పటికప్పుడు పంచుకోవాలని పేర్కొంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక విభాగం చీఫ్ డా. మరియా వాన్ ఖర్కోవ్ కీలక వీడియో సందేశం విడుదల చేశారు. 

ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల సంబంధిత ఇన్ఫెక్షన్ల పెరుగుదల వెనక కారణాలను  డా.కెర్కోవ్ వివరించారు. హాలిడే సీజన్, ప్రజలు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొనడం తదితర కారణాలతో కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కొవిడ్ వైరస్‌తో పాటూ ఇన్‌ఫ్లుయెంజా, బ్యాక్టీరియా, ఇతర పలురకాల వైరస్‌లు వ్యాప్తిలో ఉన్నాయన్నారు. ఇక కొవిడ్ వైరస్‌ మార్పులకు లోనవుతుండటంతో కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం 68 శాతం కేసులకు కరోనా ఎక్స్‌బీబీ వేరియంట్ కుటుంబానికి చెందిన వైరస్‌లు, జేఎన్.1 లాంటి సబ్ వేరియంట్లు కారణమని వెల్లడించారు. 

సింగపూర్ సహా పలు దేశాల్లో అకస్మాత్తుగా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే సింగపూర్‌లో మాస్కులు తప్పనిసరి చేశారు. భారత్‌లో కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1 బయటపడింది.

More Telugu News