dr k laxman: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 100 రోజుల సమయమిస్తాం.. ఆ తర్వాత పోరాటం: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హెచ్చరిక

  • గవర్నర్ ప్రసంగం... వాస్తవానికి దూరంగా ఉందన్న లక్ష్మణ్
  • గవర్నర్ ప్రసంగం చూశాక ఇచ్చిన హామీలపై అనుమానాలు ఉన్నాయన్న బీజేపీ ఎంపీ
  • కర్ణాటకలో ప్రయివేటు ట్రాన్సుపోర్ట్‌పై ఆధారపడి బతుకుతున్న వారు ఉపాధి లేకుండా పోయారని ఆవేదన
BJP MP Laxman warning to revanth reddy government

ఇచ్చిన హామీలను తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు చూపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే ప్రసక్తి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ హెచ్చరించారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం... వాస్తవానికి దూరంగా ఉందన్నారు. ఆరు గ్యారెంటీల కోసం నిధులను ఎలా అమలులోకి తెస్తారో చెప్పకుండా.. కారణాలు చెప్పవద్దన్నారు. గవర్నర్ ప్రసంగం చూశాక కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. గవర్నర్ ప్రసంగంలో కీలకమైన రైతు రుణమాఫీ, రైతుబంధు వంటి అంశాలు లేవన్నారు. మొదటి డీఎస్సీ సమావేశంలోనే డీఎస్సీ అని కాంగ్రెస్ చెప్పిందని, కానీ ఎందుకు ప్రకటించలేదు? అని ప్రశ్నించారు. ఈ ప్రసంగంలో కాంగ్రెస్ కార్యాచరణ లేదన్నారు.

పోలీస్ స్టేషన్‌లో గిరిజన యువతుల లాకప్ డెత్ జరిగిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ నేతలే చెప్పినట్లుగా తాము 100 రోజులు వేచి చూస్తామని, తర్వాత ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడుతామని తేల్చి చెప్పారు. కర్ణాటకలో ప్రయివేటు ట్రాన్సుపోర్ట్‌పై ఆధారపడి బతుకుతున్నవారు ఉపాధి లేకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందన్నారు. సాకులు చెప్పి తప్పించుకుంటే ఊరుకోమన్నారు.

More Telugu News