గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా సిగ్గుపడుతున్నా: కేటీఆర్
- ప్రసంగం మొత్తం అభూత కల్పనలు, అవాస్తవాలేనని విమర్శ
- అలిశెట్టి ప్రభాకర్ కవితను కోట్ చేసిన మాజీ మంత్రి
- గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో మండిపడ్డ కేటీఆర్
శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత తమకు ఉందని, తప్పకుండా నిజాలను బయటపెడతామని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితను ఆయన కోట్ చేశారు. ‘ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరినీ మోసం చేయనని, ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించినందుకు’.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కూడా ఇలాగే ఉందని, గవర్నర్ ప్రసంగం కూడా అలాగే అనిపించిందని కేటీఆర్ ఆరోపించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని, తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమేనని కేటీఆర్ పేర్కొన్నారు.