Madhya Pradesh: మధ్యప్రదేశ్ కొత్త సీఎం మోహన్ యాదవ్ తొలి రోజే సంచలన నిర్ణయం

Madhya Pradesh new CM Mohan Yadav Govt took sensational decision
  • బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు విక్రయాలపై నిషేధం విధించిన నూతన ప్రభుత్వం
  • జనాల్లో అవగాహన కల్పించాక చర్యలు ఉంటాయని హెచ్చరిక
  • తొలి కేబినెట్ నిర్ణయాలను ప్రకటించిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్‌లో నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సారధ్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తొలి రోజే సంచలన నిర్ణయాలు తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్ల విక్రయాలపై నిషేధం విధించింది. ఆహార భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించనున్నామని, బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు విక్రయించేవారిపై చర్యలు కూడా తీసుకోవాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. జనాల్లో సరైన అవగాహన కల్పించిన తర్వాత ఈ మేరకు చర్యలు ఉంటాయని కేబినెట్ భేటీ అనంతరం సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. ఫుడ్ డిపార్ట్‌మెంట్, పోలీస్ డిపార్ట్‌మెంట్, స్థానిక పట్టణ సంస్థల అధికారులు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారని సీఎం చెప్పారు. డిసెంబర్ 15 నుంచి 31 మధ్య బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు విక్రయంపై నిషేధం అమలవుతుందని చెప్పారు.

మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. అయోధ్య రాముడి గుడికి వెళ్లేవారికి మార్గమధ్యంలో మధ్యప్రదేశ్ స్వాగతం పలుకుతుందని చెప్పారు. తునికాకు సేకరించేవారికి బస్తాకు రూ.4,000 చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాగా మధ్యప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్‌ యాదవ్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు.
Madhya Pradesh
CM Mohan Yadav
BJP
Narendra Modi

More Telugu News