KCR: ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది... నా కోసం ఎవరూ ఆసుపత్రికి రావొద్దు: కేసీఆర్

  • బాత్రూంలో జారిపడిన కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి
  • యశోదా ఆసుపత్రిలో కోలుకుంటున్న మాజీ సీఎం
  • కేసీఆర్ ను పరామర్శించేందుకు భారీగా తరలివస్తున్న వైనం
  • తన ఆరోగ్య రీత్యా ఎవరినీ కలవలేనని కేసీఆర్ స్పష్టీకరణ
  • ఆరోగ్యవంతుడ్ని అయ్యాక అందరినీ కలుస్తానని వెల్లడి
KCR appeals visitors do not come to hospital

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాత్రూంలో జారిపడడంతో వైద్యులు ఆయనకు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్నిరోజులుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు యశోదా ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు. అటు, బీఆర్ఎస్ మద్దతుదారులు, కేసీఆర్ అభిమానులు కూడా ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, కేసీఆర్ ఓ వీడియో సందేశం వెలువరించారు. తనను కలిసేందుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కువమందిని కలవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారని, అందుకే తన ఆరోగ్యం దృష్ట్యా మరో 10 రోజుల వరకు ఎవరూ రావొద్దని కోరారు. 

"అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల నేను యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. అయితే వైద్య బృందం నన్ను హెచ్చరించింది. ఇన్ఫెక్షన్లు వస్తే సమస్య మరింత తీవ్రమవుతుందని డాక్టర్లు తెలిపారు. ఇన్ఫెక్షన్ల వల్ల ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వస్తాయని, నెలల తరబడి బయటికి పోలేరని వారు చెబుతున్నారు. ఈ విషయాన్ని నా మద్దతుదారులందరూ గమనించాలి. 

మీ అభిమానానికి చేతులెత్తి దండం పెడుతున్నా. మీరందరూ బాధపకుండా, మీ మీ స్వస్థలాలకు పోవాలి. రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా... ఇంకో 10 రోజుల వరకు ఎవరూ తరలి రావొద్దు. ఆసుపత్రిలో ఇతర పేషెంట్లు కూడా ఉంటారు... వారికి కూడా మనం ఇబ్బంది కలిగించకూడదు. ఇక్కడున్న వందలామంది పేషెంట్ల క్షేమం కూడా మనకు ముఖ్యం. నేను ఆరోగ్యవంతుడ్నయ్యాక అందరినీ కలుస్తాను... ఎలాగూ నేను ప్రజల మధ్యలోనే ఉంటాను కాబట్టి, మళ్లీ మనందరం కలుసుకుందాం. దయచేసి నా విజ్ఞప్తిని మన్నించి మీరందరూ మీ ఇళ్లకు వెళ్లిపోండి. నా విజ్ఞప్తిని మీరు తప్పకుండా మన్నిస్తారని ఆశిస్తున్నాను" అంటూ కేసీఆర్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. 

ఈ సందేశం వెలువరిస్తున్న సమయంలో ఓ దశలో కేసీఆర్ భావోద్వేగాలకు లోనయ్యారు. దుఃఖం వల్ల మాట రాకపోవడంతో కొద్దిగా ఇబ్బందిపడ్డారు. ఈ మేరకు వీడియోలో కనిపించింది.

More Telugu News