Crime News: తాంత్రిక పూజల పేరిట 10 మందిని హత్య చేసిన నాగర్‌కర్నూల్ వ్యక్తి?

Nagarkurnool man killed 10 people in the name of tantric worships reports saying
  • గుప్తనిధుల వెలికితీతకు తాంత్రిక పూజలు చేస్తానంటూ నిందితుడు నమ్మబలికినట్టు సమాచారం
  • అమాయకుల నుంచి భారీగా డబ్బు వసూలు, డబ్బు లేనివారి వద్ద భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం
  • నిధి దొరక్క భూమి తిరిగి ఇచ్చేయాలంటూ ఒత్తిడి చేసిన వారిని హత్య చేశాడని ప్రచారం
నాగర్ కర్నూల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తాంత్రిక పూజల పేరిట ఏకంగా 10కి పైగా హత్యలకు పాల్పడ్డాడనే వార్త కలకలం రేపుతోంది. గుప్తనిధుల ఆశచూపి, క్షుద్రపూజలు చేస్తానంటూ దూరప్రాంతాలకు తీసుకెళ్లి హత్యలకు పాల్పడినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్లలో, పొలాల్లో గుప్తనిధుల వెలికితీతకు తాంత్రిక పూజలు చేస్తానంటూ అమాయక ప్రజలను సదరు నిందితుడు నమ్మించేవాడని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయడం, డబ్బు లేని వారి స్థిరాస్తులను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చేసేవాడు.  

నిధి దొరికిన తర్వాత డబ్బులు చెల్లిస్తే తిరిగి భూమిని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మబలికేవాడని తెలుస్తోంది. ఎంతకీ నిధి దొరక్క తమ భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేసిన వారిని హత్య చేశాడని తెలుస్తోంది. ఈ విధంగా వేర్వేరు ప్రాంతాల్లో 10కిపైగా హత్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ అనుమానాస్పద మృతి కేసులుగా ఆయా పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయని సమాచారం. ఈ హత్యలకు సంబంధించి పోలీసులు మంగళవారం ప్రకటన చేసే అవకాశం ఉంది.

నవంబర్‌లో వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల మండలానికి చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి వెంకటేశ్‌ హత్యతో ఈ నిందితుడి హత్యలు బయటకొచ్చాయని తెలుస్తోంది. హత్యకు గురైన వెంకటేశ్ వద్ద నిందితుడు డబ్బులు తీసుకొని క్షుద్రపూజల పేరిట దూరంగా తీసుకెళ్లి హత్య చేసినట్టు గుర్తించారని తెలుస్తోంది. వెంకటేశ్ కుటుంబ సభ్యులతో నిందితుడికి పరిచయం ఉండడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

నవంబర్ 26న నాగర్‌కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. దర్యాప్తు చేస్తుండగా ఈ హత్యలు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. కాగా నిందిత వ్యక్తి నాగర్‌కర్నూల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అని సమాచారం. నిందిత వ్యక్తి గతంలో జిల్లాకేంద్రంలో కుటుంబంతో కలిసి నివసించేవాడని, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహించేవాడని తెలుస్తోంది. 2018లో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయాక తాంత్రిక పూజల పేరిట జనాలను నమ్మించడం మొదలుపెట్టాడని సమాచారం.
Crime News
Telangana
murder case
Nagarkurnool District

More Telugu News