Chandrababu: కేసీఆర్ 6 వారాల్లో నడుస్తారని డాక్టర్లు చెప్పారు: చంద్రబాబు

Chandrababu talks to media after visits KCR at Yashoda Hospital in Hyderabad
  • బాత్రూంలో జారిపడిన కేసీఆర్... యశోదా ఆసుపత్రిలో హిప్ రీప్లేస్ మెంట్
  • నేడు కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు
  • కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలుసుకున్న తర్వాత తృప్తిగా ఉందని వెల్లడి
  • కేసీఆర్ త్వరగా ప్రజాసేవకు పునరంకితం కావాలని చంద్రబాబు ఆకాంక్ష 
హైదరాబాదు యశోదా ఆసుపత్రిలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

"కె.చంద్రశేఖర్ రావు గారికి హిప్ ఆపరేషన్ జరగడంతో వారిని పరామర్శించడానికి వచ్చాను. ఆయనతో మాట్లాడాను. కేసీఆర్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో కూడా మాట్లాడితే, ఆయన కోలుకుని మామూలుగా నడవడానికి 6 వారాలు పడుతుందని చెప్పారు. కేసీఆర్ కు ఫిజియోథెరపీ అవసరమని కూడా చెప్పారు. 

కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లు చెప్పిన వివరాలు తెలుసుకున్న తర్వాత సంతృప్తికరంగా ఉంది. కేసీఆర్ త్వరగా కోలుకుని, మళ్లీ ప్రజాసేవ కోసం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. 

ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. ఆయన జారి కిందపడడంతో హిప్ జాయింట్ కు ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు చేసిన శస్త్రచికిత్స కూడా సఫలమైంది. వైద్యులు చెప్పిన వివరాలను బట్టి కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారు. ఆయన ఎలాంటి ఇబ్బందులు లేకుండా మామూలుగా తిరుగుతారు. మెట్లెక్కడం, ఇతర పనులు మామూలుగానే చేసుకోవచ్చు. 

కేసీఆర్ పరిస్థితి తెలిశాక ఆయనతో ఓసారి మాట్లాడాలని అనిపించింది... అందుకే ఇవాళ ఆసుపత్రి వద్దకు వచ్చాను. కేసీఆర్ కోలుకోవాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు వివరించారు.
Chandrababu
KCR
Yashoda Hospital
Hyderabad
TDP
BRS
Telangana
Andhra Pradesh

More Telugu News