Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘వెడ్ ఇన్ ఇండియా’ ఉద్యమానికి పిలుపునిచ్చిన ప్రధాని మోదీ

Modi calls Wed in India movement
Advertisement
  • ఉత్తరాఖండ్‌ను డెస్టినేషన్ వివాహాల హబ్‌గా మార్చాలని పిలుపు
  • వచ్చే ఐదేళ్లలో కుటుంబంలో కనీసం ఒక్కరైనా తమ పెళ్లిని ఉత్తరాఖండ్‌లో జరుపుకోవాలన్న మోదీ
  • డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో విదేశాల్లో పెళ్లి చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందన్న ప్రధాని
  • దేవుడు కలిపే జంటలు దేవుడి పాదాల చెంత కాకుండా విదేశాల్లో ఒక్కటి కావడం ఏంటని ప్రశ్న
Advertisement
‘మేకిన్ ఇండియా’లానే ‘వెడ్ ఇన్ ఇండియా’ ఉద్యమాన్ని అందరూ భుజాలకెత్తుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో డెస్టినేషన్ వెడ్డింగులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని.. డెస్టినేషన్ వెడ్డింగ్స్ స్థానంలో దేశంలోనే వివాహాలు జరుపుకోవాలని సంపన్నులను కోరారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో రెండు రోజులపాటు జరిగే ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ని మోదీ నిన్న ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెడ్ ఇన్ ఇండియా ద్వారా దేశంలో వివాహాల ఉద్యమం రావాలని ఆకాంక్షించారు. ‘‘మిలియనీర్లు, బిలియనీర్లకు నేను చెప్పేది ఒక్కటే. పెళ్లిళ్లను దేవుడే నిర్ణయిస్తాడని మనం భావిస్తాం. మరి దేవుడు ఒక్కటి చేసిన జంట తమ కొత్త ప్రయాణాన్ని దేవుడి పాదాల నుంచి కాకుండా విదేశాల్లో ఎందుకు ప్రారంభిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను యువతను కోరేది ఒక్కటే. మేకిన్ ఇండియా లానే వెడ్ ఇన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించండి’’ అని పేర్కొన్నారు. 

ఇండియాలో పెళ్లి చేసుకోవడాన్ని చాలామంది చిన్నచూపు చూస్తూ విదేశాలకు పరుగులు తీస్తున్నారని, విదేశాల్లో పెళ్లాడడం సంపన్నులకు ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి కుటుంబంలో ఒకరు తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను దేవభూమి ఉత్తరాఖండ్‌లో జరుపుకోవాలని కోరారు. ప్రతి ఏడాది ఇక్కడ 5 వేల వివాహాలు జరిగితే కొత్త మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులోకి వస్తాయన్నారు. అప్పుడది ప్రపంచంలోనే అతిపెద్ద వెడ్డింగ్ డెస్టినేషన్ అవుతుందని పేర్కొన్నారు. మనం తలచుకుంటే అదేమంత పెద్ద విషయం కాదని ప్రధాని వివరించారు. 

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ, టాలీవుడ్ నటుడు వరుణ్‌తేజ్-లావణ్య త్రిపాఠీ ఇటలీలో వివాహం చేసుకున్నారు. వీరేకాదు ఎంతోమంది డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో విదేశాల్లో ఆర్భాటంగా వివాహాలు చేసుకుంటున్నారు. దీంతో దేశ మారకద్రవ్యం విదేశాలకు తరలిపోతోంది. ఈ వివాహాల వల్ల దేశానికి పైసా ఆదాయం లేకపోగా, ఇటలీ వంటి దేశాలు డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్‌లుగా మారుతున్నాయి. ముకేశ్ అంబానీ సహా కొందరు బిలియనీర్లు రాజస్థాన్ రాజధాని జైపూర్‌ను డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఎంచుకుంటున్నారు.
Advertisement
Advertisement
Wed In India
Make In India
Narendra Modi
Uttarakhand

More Telugu News