PM Modi: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మరోసారి ప్రధాని మోదీ

  • సర్వే చేపట్టిన అమెరికా కన్సల్టెన్సీ సంస్థ మార్నింగ్ కన్సల్ట్
  • సెప్టెంబరు 6 నుంచి 12 వరకు అభిప్రాయ సేకరణ
  • మోదీకి 76 శాతం మంది మద్దతు
PM Modi stands as world most popular leader

ప్రధాని నరేంద్ర మోదీ పాప్యులారిటీ గురించి అందరికీ తెలిసిందే. విదేశాల్లోనూ ఆయన పర్యటనలకు భారీగా జనాలు తరలివస్తుంటారు. ప్రవాస భారతీయుల్లోనూ ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

ఇక సోషల్ మీడియాలో మోదీ ఛరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్స్ లో 93.6 మిలియన్ల మంది, ఇన్ స్టాగ్రామ్ లో 82.2 మిలియన్ల మంది, ఫేస్ బుక్ లో 48 మిలియన్ల మంది ఆయనను అనుసరిస్తుంటారు. ఇప్పటికే మోదీ పలు పర్యాయాలు ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ పొందిన నేతగా పలు సర్వేల్లో అత్యధిక రేటింగ్ అందుకున్నారు. 

తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ 'మోర్నింగ్ కన్సల్ట్' సంస్థ చేపట్టిన సర్వేలోనూ మోదీకే అగ్రస్థానం లభించింది. మోదీకి అనుకూలంగా 76 శాతం మంది ఓటేశారు. మోదీ తర్వాత రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ నిలిచారు. ఆయనకు 66 శాతం రేటింగ్ లభించింది. మోదీకి, లోపెజ్ కు మధ్య 10 శాతం అంతరం ఉండడం మోదీ ఆకర్షణను చాటుతోంది. 

58 శాతం రేటింగ్ తో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ మూడో స్థానంలో, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా 49 శాతం రేటింగ్ తో నాలుగో స్థానంలో ఉన్నారు. 47 శాతం రేటింగ్ తో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఐదో స్థానంలో నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ 41 శాతంతో ఆరో స్థానంలో ఉన్నారు. 

మొత్తం 22 మంది ప్రపంచ నేతలపై ఈ మేరకు అభిప్రాయ సేకరణ జరిపారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సెప్టెంబరు 6 నుంచి 12 వరకు ఈ సర్వే నిర్వహించింది. 

ఇక, అత్యంత తక్కువ వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేత కూడా మోదీనే. మోదీని వ్యతిరేకిస్తున్నవారు కేవలం 18 శాతం మందే. అదే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను అత్యధికంగా 58 శాతం మంది వ్యతిరేకిస్తున్నారట.

More Telugu News