Ganta Srinivasa Rao: అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్రం మరోసారి స్పష్టంగా చెప్పింది: గంటా

  • ఏపీ రాజధాని అమరావతి అంటూ రాజ్యసభలో కేంద్రం వెల్లడి
  • ఇప్పటికైనా కళ్లు తెరవండి సీఎం గారూ అంటూ గంటా ధ్వజం
  • ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం
  • మీ మోసాన్ని విశాఖ ప్రజలు పసిగట్టారంటూ వ్యాఖ్యలు
Ganta Srinivasarao slams CM Jagan on Amaravati issue

ఏపీ రాజధాని అమరావతేనని, కేంద్రం అభివృద్ధి చేయదలుచుకున్న రాజధానుల మాస్టర్ ప్లాన్ లో అమరావతి పేరు ఉందని నిన్న రాజ్యసభలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కుమార్ ప్రకటన చేయడం తెలిసిందే. 

దీనిపై టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు స్పందించారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్రం మరోమారు స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా మీ కళ్లు తెరవండి జగన్ మోహన్ రెడ్డి గారూ అంటూ ఎక్స్ లో వ్యాఖ్యానించారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కార్యాలయాల మార్పు కుదరదని చెప్పిన తీర్పును గౌరవించకుండా... ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణను కారణంగా చూపుతూ క్యాంపు కార్యాలయాల పేరుతో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించవలసిన అవసరం ఏమొచ్చిందని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. 

చట్టపరంగా సాధ్యం కాదని తేలడంతో దొడ్డిదారి మార్గాలను ఎంచుకున్నారని ఆరోపించారు. ఇలా అమరావతి రైతులను ఇబ్బంది పెడుతూ ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని నిలదీశారు. 

"విశాఖలో రుషికొండను బోడిగుండుగా మార్చి సర్వనాశనం చేశారు. రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయలు సీఎం కార్యాలయానికి వెచ్చించారు. మీకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నిజంగా గుర్తుంటే... ఈ 4 సంవత్సరాల 8 నెలల పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడే భోగాపురం ఎయిర్ పోర్ట్ గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ, మెట్రో గురించి కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీరు, తాగునీరు కష్టాలను తీర్చగలిగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు గురించి కానీ పాటుపడేవారు. ఇప్పుడు ఎన్నికలకు మూడు నెలల ముందు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తుకొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు?

 మా విశాఖ ప్రజలు అన్ని ప్రాంతాల అభివృద్ధి కోరుకుంటున్నారు కానీ, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే రాజధాని కాదు. రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులను రోడ్డున పడేశారు. తమకు రాజధాని వద్దంటున్న విశాఖ ప్రజల మనోవేదనను అర్థం చేసుకోకుండా అన్నీ ప్రాంతాల వారిని ఇబ్బంది పెడుతూ మీరు సాధించేది ఏంటో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి.

విశాఖ ప్రజలు చాలా తెలివైన వారు... మీ మాటలను నమ్మే పరిస్థితిలో లేరు. మీరు చేస్తున్న మోసాన్ని విశాఖ వాసులు పసిగట్టేశారు... 2024లో మీ ప్రభుత్వ పతనం ఇదే విశాఖ నుంచే ప్రారంభం అవుతుందని గుర్తుంచుకోండి జగన్ మోహన్ రెడ్డి గారు" అంటూ గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.

More Telugu News