Singareni elections: సింగరేణి ఎన్నికల తేదీ ఖరారు

  • డిసెంబర్ 27న నిర్వహించనున్నట్టు లేబర్ కమిషన్ డిప్యూటీ చీఫ్ అధికారి శ్రీనివాసులు ప్రకటన
  • కార్మిక సంఘాలతో సమావేశంలో ఎన్నికల నిర్వహణకు ఏకాభిప్రాయం
  • హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతాయని వెల్లడి
Singareni elections to be held on December 27

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా వాయిదా పడిన సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల తేదీ ఖరారైంది. ఈ నెల 27న నిర్వహించనున్నట్టు డిప్యూటీ చీఫ్ కమిషనర్‌ ఆఫ్ లేబర్ శ్రీనివాసులు సోమవారం ప్రకటించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. సింగరేణిలోని 13 కార్మిక సంఘాల నాయకులతో హైదరాబాద్‌లోని కార్మికశాఖ ఆఫీస్‌లో సోమవారం ఆయన భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణకు ఏకాభిప్రాయం కుదరడంతో ప్రకటన చేశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డితోపాటు జాతీయ సంఘాల నాయకులు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌, ఇతర సంఘాల నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. 

కాగా సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికలు ఇప్పటికే ముగియాల్సి ఉన్నప్పటికీ తెలంగాణ ఎన్నికలు -2023 కారణంగా వాయిదాపడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడడంతో సింగరేణి ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఇప్పటికే కార్మికుల ఓటరు లిస్టును ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు. కాగా ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ, గుర్తుల కేటాయింపు ముగిశాయి. అక్టోబర్ 30 నుంచి నామినేషన్లు స్వీకరించిన విషయం తెలిసిందే. కాగా 2017 సెప్టెంబర్‌‌ 5న జరిగిన సింగరేణి ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించింది. మొత్తం 11 ఏరియాల్లో తొమ్మిదింటిని గెలుచుకొని గుర్తింపు సంఘంగా నిలిచింది.

More Telugu News