BRS: బీఆర్ఎస్‌కు దెబ్బ పడిందెక్కడ?.. గెలిపిస్తాయనుకున్నవే బూమరాంగ్ అయ్యాయా?

  • మూడోసారి అధికారంలోకి రావాలన్న కేసీఆర్ ఆశలను చిదిమేసిన ప్రజలు
  • కారుకు బ్రేకులు వేసిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, ప్రభుత్వ పథకాలు
  • నిండా ముంచిన నిరుద్యోగులు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు
  • దళితబంధు, బీసీబంధుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
Why KCR Los In Telangana Assembly Polls Reason Is

తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రీ దక్కించుకోని రికార్డును సొంతం చేసుకోవాలన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశలను ప్రజలు తుంచేసి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. హైదరాబాద్ ప్రజలు గంపగుత్తగా బీఆర్ఎస్‌కు పట్టంకట్టినా అచ్చ తెలంగాణ గ్రామాలు బీఆర్ఎస్‌ను ఆమడదూరం పెట్టాయి. గత పదేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని భావించిన బీఆర్ఎస్‌కు అవే బూమరాంగ్ అయ్యాయి. 

ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లోపాలు ఆ పార్టీకి శాపంగా పరిణమించాయి. 119 స్థానాలకు గాను 39 స్థానాలకే పరిమితమైంది. స్వయంగా కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయారు. ఆరుగురు ఎమ్మెల్యేలు పరాజయం పాలయ్యారు. తమ పథకాలే తమను ఒడ్డున పడేస్తాయని బీఆర్ఎస్ భావించింది. అయితే, అవే చివరికి వ్యతిరేకంగా మారాయి. మరీ ముఖ్యంగా దళితబంధు లాంటి పథకాలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఈ పథకం ద్వారా కొంతమందికే లబ్ధి చేకూరడం, అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో సన్నిహితంగా ఉన్న వారికే అందడం, లబ్ధిదారుడికి అందులో సగం మాత్రమే అందించి మిగతాది నాయకుల జేబుల్లోకి వెళ్లడం, బీసీబంధు ప్రకటించినా ఒకరిద్దరికి మాత్రమే ఇవ్వడం వంటివి ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. 

డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా కేసీఆర్ ఓటమికి కారణమయ్యాయి. ఇచ్చిన దానికి, ఇస్తామన్న దానికి పొంతన లేకపోవడం, నాయకుల జోక్యం వంటివి ప్రభత్వంపై వ్యతిరేకత పెంచాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ఉద్యోగ నియామకాల్లో జాప్యం. నిరుద్యోగుల ఆగ్రహం బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెను శాపంగా మారింది. ఈ విషయాన్ని ముందే గుర్తించి ఈసారి గెలిస్తే తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని స్వయంగా కేటీఆరే హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత కూడా కేసీఆర్ ఓటమికి గల కారణాల్లో ఒకటి.

వ్యతిరేకత ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇవ్వడం, కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వంటివి బీఆర్ఎస్ ఓటమిలో ముఖ్య భూమిక పోషించాయి. అయితే, హైదరాబాద్ అభివృద్ధి మాత్రం పరువు నిలుపుకునేలా చేసింది. బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోనే అత్యధికం కావడం గమనార్హం.

More Telugu News