BRS: కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ అభినందనలు

  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్‌కు అభినందనలు అంటూ ట్వీట్
  • తెలంగాణ ప్రజల సంక్షేమమే పరమావధిగా బీఆర్ఎస్ పార్టీ కృషిని కొనసాగిస్తుందని వెల్లడి
  • ప్రజాతీర్పును విశ్లేషించుకుని ముందుకు సాగుతామని ప్రకటన
BRS Congratulations to the Congress Party over win in Telangana election

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి అధికారాన్ని సొంతం చేసుకున్న  కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అభినందనలు తెలిపింది. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు, మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీకి అభినందనలు అంటూ బీఆర్ఎస్ అఫీషియల్ ‘ఎక్స్’ ఖాతా వేదికగా స్పందించింది. ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ శిరసావహిస్తోందని, ప్రజాతీర్పును విశ్లేషించుకుని ముందుకు సాగుతామని వెల్లడించింది.

పోరాడి సాధించుకున్న తెలంగాణను గత పదేళ్ల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి పథంలో నిలిపిందని, భవిష్యత్‌లో సైతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల సంక్షేమమే పరమావధిగా బీఆర్ఎస్ పార్టీ కృషిని కొనసాగిస్తుందని వెల్లడించింది.
 
ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అంకిత భావంతో, అహర్నిశలు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా వారియర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని పార్టీ పేర్కొంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటోని ఉంచి పార్టీ సందేశాన్ని అందించింది. ఈ మేరకు కాంగ్రెస్ గెలుపు అనంతరం స్పందించింది.

ఇదిలావుండగా తెలంగాణ అధికార పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 64 సీట్లను సొంతం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇక 39 సీట్లు మాత్రమే గెలిచిన బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.

More Telugu News