Revanth Reddy: కొడంగల్ గడ్డకు శిరసు వంచి నమస్కరిస్తున్నా: రేవంత్ రెడ్డి

Revanth Reddy reacts to his victory in Kodangal
  • తెలంగాణలో హస్తం హవా
  • అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జోరు
  • కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఘనవిజయం
  • ఊపిరి ఉన్నంతవరకు కొడంగల్ నియోజకవర్గమే శ్వాసగా జీవిస్తానన్న రేవంత్ 
ఓడలు బండ్లు అవుతాయి... బండ్లు ఓడలు అవుతాయి! ఈ నానుడి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి అతికినట్టు సరిపోతుంది. ఒకప్పుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్లి, రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారగా... ఆ తర్వాత ఎంపీగా గెలిచి, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని విజయపంథాలో నడిపిస్తుండడం రేవంత్ రెడ్డికే చెల్లింది. తదుపరి సీఎం కూడా ఆయనే అంటున్నారు! 

కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఘనవిజయం అందుకున్నారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని వినమ్రంగా పేర్కొన్నారు. కొన ఊపిరి ఉన్నంతవరకు కొడంగల్ నియోజకవర్గమే శ్వాసగా జీవిస్తానని స్పష్టం చేశారు. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని భావోద్వేగపూరితమైన హామీ ఇచ్చారు. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బ్రతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటానని, దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా తీర్చిదిద్దుతానని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.
Revanth Reddy
Kodangal
Congress
Telangana

More Telugu News