Telangana Assembly Election: ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు ఇబ్రహీంపట్నంలో కలకలం.. ఆర్డీవో గదిలో సీలు లేని పోస్టల్ బ్యాలెట్లు

  • పాస్‌ల కోసం ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు
  • తెరిచి ఉన్న పోస్టల్ బ్యాలెట్లు ఉంచిన గది
  • వాటిలో కొన్నింటి సీలు తెరిచి ఉండడంతో ఆందోళన
  • ఆర్డీవోపై దాడికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు
  • అక్కడ పోలైన 3 వేలకు పైగా ఓట్లు భద్రంగా ఉన్నాయన్న డీసీపీ
Tensions prevelled in Postal Ballot as ballot vote boxes seal opened

ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్లు కనిపించడం కలకలం రేపింది. స్ట్రాంగ్‌రూములో ఉండాల్సినవి అక్కడ ఉండడం, వాటిలో కొన్నింటికి సీల్ తీసి ఉండడం వివాదానికి కారణమైంది. విషయం తెలిసిన కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో అనంతరెడ్డి ఉద్దేశపూర్వకంగానే పోస్టల్ బ్యాలెట్ కవర్లు ఉన్న డబ్బాలు సీలు తొలగించారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.


నేడు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు పాస్‌ల కోసం ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు రాత్రి 8 గంటల సమయంలో వచ్చారు. అక్కడ పోస్టల్ బ్యాలెట్లు ఉంచిన గది తెరిచి ఉండడంతో అనుమానించిన వారంతా లోపలికి వెళ్లి చూసి షాకయ్యారు. ఎందుకిలా? అని ఆర్డీవోను ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో లోపలికి వెళ్లి చూస్తే పోస్టల్ కవర్లు ఉన్న డబ్బాలు కొన్ని సీలు తెరిచి ఉండగా, మరికొన్ని ఖాళీగా ఉన్నాయి. 

దీనిపై ఆర్డీవో మాట్లాడకపోవడంతో దాడికి యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారంతా అక్కడే బైఠాయించారు. దీంతో ఆర్డీవోను ఓ గదిలో ఉంచి తాళం వేసిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించివేశారు. విషయం తెలిసిన మహేశ్వరం డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అక్కడ పోలైన 3 వేలకుపైగా పోస్టల్‌ బ్యాలెట్లు 11 బాక్సుల్లో సీలువేసి భద్రంగా ఉన్నాయని, మిగతావి ఖాళీవని ఆయన తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపించనున్నట్టు కలెక్టర్ హొళికేరి తెలిపారు.

More Telugu News