CBN: తెలుగు ప్రజలు సిరిసంపదలతో సంతోషంగా ఉండాలని దుర్గమ్మను కోరా: చంద్రబాబు

  • తెలుగు జాతికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని వేడుకున్నానన్న చంద్రబాబు 
  • ఎంతమంది దుష్టులు అడ్డొచ్చినా ఎదుర్కొంటూ ముందుకెళతానని వెల్లడి 
  • మానవ సంకల్పానికి దైవం ఆశీస్సులు కావాలనే ఈ  యాత్ర చేపట్టానన్న బాబు  
Chandrababu Temple visit with wife Bhuvaneswari

తెలుగు ప్రజలు సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో జీవించేలా, వారికి సేవ చేసే అవకాశం ఇమ్మని అమ్మవారిని వేడుకున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని దుర్గమ్మ గుడికి భార్యతో కలిసి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్నాక బయట మీడియాతో మాట్లాడారు. తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలనేదే తన లక్ష్యమని, అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, దుష్టశక్తులు అడ్డుకున్నా తన పయనం ఆగబోదని స్పష్టం చేశారు. మానవ సంకల్పానికి దైవం ఆశీస్సులు ఉండాలని, అందుకే తాను ఈ యాత్ర చేపట్టానని చెప్పారు. శుక్రవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు వివరించారు.

దుష్టుల నుంచి సమాజాన్ని రక్షించాలని శక్తి స్వరూపిణి కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు. తనకు అన్యాయం జరిగినప్పుడు దేశవిదేశాల్లోని తెలుగు వారంతా న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటాలు చేశారన్నారు. కాగా, చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలకకగా.. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి తీర్థప్రసాదాలు, ఫొటో అందజేశారు. చంద్రబాబుకు కేశినేని నాని, కేశినేని చిన్ని, జనసేన నేత పోతిన మహేశ్, పంచుమర్తి అనురాధ, అశోక్ బాబు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, బోండా ఉమా, మాగంటి బాబు, బుద్దా వెంకన్న తదితరులు స్వాగతం పలికారు.



More Telugu News