Mizoram assembly election: మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 4కి వాయిదా.. కారణం ఇదే

  • డిసెంబర్ 3న ప్రత్యేక ప్రాముఖ్యత దృష్ట్యా తేదీని సవరించిన ఎన్నికల సంఘం
  • క్రైస్తవులు ఎక్కువగా ఉండే మిజోరాంలో ఈ ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు
  • కౌంటింగ్ వాయిదా వేయాలంటూ వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఈసీ
Counting of Mizoram assembly election postponed to December 4

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం మిజోరాంలో ఎన్నికల కౌంటింగ్ తేదీని భారత ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ముందుగా నిర్ణయించిన డిసెంబర్ 3 నుంచి మరుసటి రోజు డిసెంబర్ 4కి మార్చినట్టు శుక్రవారం ప్రకటించింది. వాస్తవానికి తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతోపాటు డిసెంబర్ 3న కౌంటింగ్ జరగాల్సి ఉంది. కానీ, క్రైస్తవులు అధిక సంఖ్యలో నివసించే మిజోరాం ఈ ఆదివారం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగివుందని, రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ప్రత్యేక ప్రార్థనలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కౌంటింగ్ తేదీని వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు అందాయి. మిజోరం ఎన్‌జీవో సమన్వయ కమిటీ సభ్యులతోపాటు పలు సంఘాల నుంచి విజ్ఞప్తులు రావడంతో వీటన్నింటిని భారత ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. కౌంటింగ్ తేదీని సవరించి డిసెంబర్ 4కు(సోమవారం) వాయిదా వేసినట్టు వెల్లడించింది.

ఎన్నికల సంఘం నిర్ణయానికి ముందు ఎన్నికల కౌంటింగ్ తేదీని వాయిదా వేయాలంటూ మిజోరాం ఎన్‌జీవో సమన్వయ కమిటీ సభ్యులు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కాగా ఈ కమిటీ చాలా ప్రభావవంతమైనది. సెంట్రల్ యంగ్ మిజో అసోసియేషన్, మిజో జిర్లై పాల్‌తోపాటు కీలకమైన పౌర సమాజ సంస్థలు, విద్యార్థి సంఘాలకు ప్రధాన సంస్థగా వ్యవహరిస్తోంది.

కాగా గురువారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మిజోరాంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశాయి. మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎంఎన్ఎఫ్ 14-18 సీట్లు, జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం) 12-16 స్థానాలు, కాంగ్రెస్ 8-10 సీట్లు, బీజేపీ 0–2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ విశ్లేషించింది. కాగా మిజోరం శాసన సభకు నవంబర్ 7న పోలింగ్ జరిగింది. 8.57 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 174 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సవరించిన కౌంటింగ్ తేదీ ప్రకారం వారందరి భవితవ్యం డిసెంబర్ 4న తేలనుంది.

More Telugu News