Pawan Kalyan: జగన్ లో విషం పోయి మంచిగా మారితే మళ్లీ రానిద్దాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan speech in Janasena party meeting in Mangalagiri
  • మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం
  • వైఎస్ జగన్ రాజకీయాల్లో ఉండకూడదన్న పవన్
  • జగన్ ఒక ప్రజా కంటకుడని విమర్శలు
  • తాము టీడీపీ వెనుక నడవడంలేదని, కలిసి నడుస్తున్నామని స్పష్టీకరణ 
మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ రాజకీయాల్లో ఉండకూడదని అన్నారు. ఒక పదేళ్ల పాటు ఆయనను బయట కూర్చోబెడదాం అని వ్యాఖ్యానించారు. 

జగనేమీ మహాత్మా గాంధీ, వాజ్ పేయి వంటి మహనీయుడు కాదని, ఒక ప్రజా కంటకుడు అని అభివర్ణించారు. ఆయనలో విషం తొలగిపోయి, మంచిగా మారితే మళ్లీ రానిద్దాం అని పేర్కొన్నారు. ఏపీలో మరో 100 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని, ప్రతి రోజూ వైసీపీ ఓట్ షేర్ 0.5 శాతం తగ్గేలా పనిచేద్దామని శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. 

జగన్ కోరుకున్న కురుక్షేత్రం యుద్ధం కాదు కానీ, జగన్ ను బయటికి పంపించే బలమైన యుద్ధం చేద్దామని అన్నారు. "మాట్లాడితే ఇది ఎన్నికల కురుక్షేత్రం అని జగన్ అంటాడు. నువ్వేమైనా అర్జునుడివా, లేక శ్రీకృష్ణుడివా...? లక్ష కోట్లు దోచిన వ్యక్తివి నువ్వు... కురుక్షేత్రం గురించి నీలాంటి వాడు మాట్లాడకూడదు" అంటూ ధ్వజమెత్తారు. 

నడ్డా మన పార్టీ కండువా అడిగి మరీ వేయించుకున్నారు

150 మందితో మొదలైన జనసేన పార్టీ ప్రస్థానం నేడు 6.5 లక్షల క్రియాశీలక సభ్యులతో బలంగా తయారైంది. మొన్న బీజేపీ అధినేత జేపీ నడ్డా గారు కూడా జనసైనికుల ఉత్సాహం చూసి వారి నిబద్ధత చూసి మన పార్టీ కండువా అడిగి మరీ వేయించుకున్నారు. ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకమైన బీజేపీ ఇవాళ మన పార్టీ పట్ల గౌరవం చూపిస్తోంది. అది మన నిబద్ధతకు లభించిన గుర్తింపు. 

జనసేన ఒక శక్తిమంతమైన భావజాలం ఉన్న పార్టీ. బలమైన నూతన నాయకత్వం తీసుకురావాలి అని పనిచేసే పార్టీ. కానీ, వైసీపీకి ఒక స్పష్టమైన భావజాలం లేదు. వారికి జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని తప్ప వేరే భావజాలం లేదు. మాజీ సీఎం కుమార్తె, ప్రస్తుత సీఎం సోదరి కూడా పార్టీ పెట్టినా తెలంగాణలో పోటీ  చేయలేకపోయారు. కానీ జనసేన పోటీ చేయగలిగింది. అదీ మన భావజాలం తాలూకు బలం.

వెళ్లిపోయిన వారికి ఒక్కటే చెబుతున్నా...

2014లో రాష్ట్ర విభజన సమయంలో నేను పార్టీ పెట్టకపోతే రాష్ట్రానికి ద్రోహం చేసిన వాడ్ని అవుతాను. అందుకే పార్టీ స్థాపించాను. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో టీడీపీకి మద్దతు ఇచ్చాను. నేను ఏం చేసినా అది రాష్ట్రం కోసమే. 2019లో ఓడిపోయిన తర్వాత చాలామంది పార్టీ నుంచి వెళ్లిపోయారు. నాదెండ్ల మనోహర్ వంటి వ్యక్తి, మీలాంటి వారు నాతో నిలబడ్డారు. 

వెళ్లిపోయిన వారికి ఒక్కటే చెబుతున్నా... రెండు పార్లమెంటు సీట్లతో వచ్చిన బీజేపీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది. ఓపికలేక వెళ్లిపోయిన వారు నాపై విమర్శలు చేస్తున్నారు. అలాంటివి నేను పట్టించుకోను. ఇటీవల కాలంలో మన పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు వైసీపీలోకి వెళ్లారు. వారు మనపై విమర్శలు చేస్తున్నారు. రేపు మా ప్రభుత్వం వస్తుంది... అప్పుడు వారు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు?

మనం టీడీపీ వెనుక నడవడంలేదు... టీడీపీతో కలిసి నడుస్తున్నాం

డబ్బులు లేకపోతే పార్టీ నడపలేం అని నాడు అన్నారు. కానీ పదేళ్లుగా పార్టీని నడుపుతున్నాం. నేను షూటింగ్ లో ఉంటే అపాయింట్ మెంట్ కోసం పడిగాపులు కాసినవాళ్లు కూడా ఇవాళ నాపై విమర్శలు చేస్తున్నారు. అయినా సరే నేను నిలబడ్డాను, పార్టీని ముందుకు తీసుకెళుతున్నాను. 

వైసీపీ నేతలను తరిమికొట్టేందుకు జనసేన-టీడీపీ కలసి పనిచేస్తున్నాయి. ఇది ప్రజలు, స్థానిక జనసేన నేతల అభీష్టం మేరకు తీసుకున్న నిర్ణయం. అయితే మనం టీడీపీ వెనుక నడవడంలేదు... టీడీపీతో కలిసి నడుస్తున్నాం" అన్నారు పవన్.
Pawan Kalyan
Janasena
Mangalagiri
Andhra Pradesh

More Telugu News