Dominica: 2024 టీ20 వరల్డ్ కప్‌ ఆతిథ్యం నుంచి వైదొలగిన డొమినికా!

Dominica has pulled out of hosting the 2024 T20 World Cup
  • నిర్ణీత గడువులోగా వేదికలను సిద్ధం చేయలేమన్న కరేబియన్ దేశం
  • టోర్నీ ఆరంభానికల్లా విండ్సర్ పార్క్ స్పోర్ట్స్ స్టేడియం, బెంజమిన్స్ పార్క్‌‌లో పనులు పూర్తి కావని వెల్లడి
  • ప్రకటన విడుదల చేసిన డొమినికా ప్రభుత్వం
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024 ఆతిథ్యం నుంచి కరేబియన్ దేశం డొమినికా వైదొలగింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లు, ప్రధాన మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్న వేదికలకు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో డొమినికా ఈ నిర్ణయం తీసుకుంది. ఆతిథ్యమివ్వనున్న వేదికలలో ఒకటైన విండ్సర్ పార్క్‌లో పనులు జరుగుతున్న వేగాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత డొమినికా ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం పనులు జరుగుతున్న వేగాన్ని పరిశీలిస్తే నిర్ణీత సమయంలో వేదికలను సిద్ధం చేయలేమని పేర్కొంది.

ప్రాక్టీస్, టోర్నీ మ్యాచ్‌లు నిర్వహించాలని భావించిన విండ్సర్ పార్క్ స్పోర్ట్స్ స్టేడియం, బెంజమిన్స్ పార్క్‌లో వసతులను మెరుగుపరచాల్సి ఉంది. అవసరమైన చోట అదనపు పిచ్‌లను కూడా రూపొందించాల్సి ఉంది. కానీ ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని డొమినికా ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. కాంట్రాక్టర్లు సమర్పించిన పనుల పురోగతిని పరిశీలిస్తే టోర్నమెంట్ ప్రారంభానికి ముందు నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం సాధ్యం కాదని వివరించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వడంలో డొమినికాకు ఉన్న ఖ్యాతి దృష్ట్యా తాజా నిర్ణయం అందరికీ మేలు చేస్తుందని డొమినికా పేర్కొంది. జూన్ 2024లో టీ20 వరల్డ్ కప్‌ను విజయవంతంగా నిర్వహించాలని నిర్వాహకులకు డొమినికా శుభాకాంక్షలు తెలిపిందని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో రిపోర్ట్ పేర్కొంది.

ఇదిలావుంచితే.. 2024 టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా, కరేబియన్‌లోని 7 దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. డొమినికాతోపాటు ఆంటిగ్వా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు ఉన్నాయి. తాజాగా డొమినికా వైదొలగడంతో 6 కరేబియన్ దేశాలు మాత్రమే ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
Dominica
2024 T20 World Cup
Cricket

More Telugu News