Kane Williamson: విరాట్ కోహ్లీ, బ్రాడ్‌మాన్ రికార్డును సమం చేసిన కేన్ విలియమ్సన్

  • టెస్టు కెరీర్‌లో 29వ సెంచరీని సాధించిన కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్
  • రికార్డు సెంచరీతో టెస్ట్ ఫార్మాట్‌లో కోహ్లీ, బ్రాడ్‌మాన్ సరసన నిలిచిన విలియమ్సన్
  • బంగ్లాదేశ్‌పై మొదటి టెస్టులో ఘనత సాధించిన కేన్
Kane Williamson equals Virat kohli and Bradmans record

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ కీలకమైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టు కెరీర్‌లో 29వ సెంచరీని పూర్తి చేసి ఆల్‌టైమ్ గ్రేట్, ఆసీస్‌ దిగ్గజం బ్రాడ్‌మన్‌, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. సిల్హెట్ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు మ్యాచ్‌లో విలియమ్సన్ 205 బంతుల్లో 104 పరుగులు కొట్టి ఔటయ్యాడు. 95వ టెస్టు మ్యాచ్‌లో విలియమ్సన్ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. విలియమ్సన్ 95వ టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు. విరాట్ కోహ్లీ( 111 మ్యాచ్‌లు) కంటే 16 మ్యాచ్‌లు ముందుగానే ఈ రికార్డును అందుకోవడం విశేషం. కాగా అంతర్జాతీయ క్రికెట్ కెరియర్‌లో కేన్‌కు ఇది 42వ సెంచరీ కావడం గమనార్హం. 

మరోవైపు న్యూజిలాండ్ తరపున వరుసగా నాలుగు సెంచరీలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా కేన్ విలియమ్సన్ రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ కంటే ముందు  ఈ ఏడాదే జరిగిన ఇంగ్లండ్, శ్రీలంక సిరీస్‌‌లలోనూ వరుస సెంచరీలు బాదాడు. దీంతో 2010లో టెస్టు క్రికెట్ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన విలియమ్సన్ స్వల్పకాలంలోనే 29 సెంచరీలు అందుకున్నాడు. ఇదిలావుంచితే మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 310 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లు నష్టపోయి 266 పరుగులు చేసింది.

More Telugu News